calender_icon.png 7 October, 2024 | 4:57 AM

గాఫ్‌దే చైనీస్

07-10-2024 12:51:45 AM

చైనా ఓపెన్ నెగ్గిన అమెరికన్ స్టార్ 

ఫైనల్లో ముచోవా పరాజయం

8 - కోకో గాఫ్ కెరియర్లో సాధించిన టైటిళ్ల సంఖ్య 

బీజింగ్: చైనా ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6-1, 6-3 తేడాతో ముచోవా (చెక్ రిపబ్లిక్) మీద సునాయస విజయం సాధించింది. ఫైనల్లో ముచోవాను వరుస సెట్లలో ఓడించి 2013 (సెరెనా విలియమ్స్) తర్వాత చైనా ఓపెన్‌ను కైవసం చేసుకున్న అమెరికా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

కోకో గాఫ్‌కు 20 సంవత్సరాల వయసు మాత్రమే. 2023 యూఎస్ ఓపెన్‌ను కూడా గాఫ్ కైవసం చేసుకుంది. కానీ ఈ సారి మాత్రం యూఎస్ ఓపెన్‌లో ఆ ఫీట్‌ను రిపీట్ చేయడంలో విఫలమైంది. అయినా కానీ ఆ ప్రభావం చైనా ఓపెన్ మీద పడకుండా జాగ్రత్త పడింది. ప్రపంచ 49వ ర్యాంకులో ఉన్నా కానీ ఫైనల్‌కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన ముచోవా ఫైనల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఫైనల్ పోరులో గాఫ్ ఆరు ఏస్‌లు సంధించగా.. ముచోవా మాత్రం కేవలం ఒక్కటంటే ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. గాఫ్ ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసినా కానీ ముచోవా సద్వినియోగం చేసుకోలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద ఏ సెట్ కూడా టై బ్రేకర్‌కు దారి తీయలేదు. కేవలం గంటా 16 నిమిషాల పాటు మాత్రమే ఈ ఫైనల్ పోరు సాగింది. 

పలోని ద్వయం పట్టేసింది

మహిళల డబుల్స్ టైటిల్‌ను జాస్మిన్ పలోని- ఎర్రానీ (ఇటలీ) జోడీ గెల్చుకుంది. 6-4, 6-3 తేడాతో చాన్ హో చింగ్-వెరోనికా (తైవాన్) జోడీ మీద విజయం సాధించింది. మ్యాచ్‌లో చెరో ఏస్ సంధించినా కానీ చివరికి మాత్రం పలోని జోడీనే విజయం వరించింది. పలోని-ఎర్రానీ జోడీ కంటే 1 డబుల్ ఫాల్ట్ ఎక్కువగా చేసిన వెరోనికా ద్వయం మూల్యం చెల్లించుకుంది.