calender_icon.png 6 November, 2024 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకన్నకు గద్వాల పంచె

01-10-2024 12:23:07 AM

  1. ఐదుగురు నేతన్నల 41 రోజుల శ్రమ
  2. 400 ఏండ్ల ఆచారం

గద్వాల (వనపర్తి), సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గద్వాల అనగానే మనకు గుర్తొచ్చేది చేనేత చీరెలు. ఇక్కడ నేసే చీరెలు, పంచెలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నది. గద్వాలకు మరో అరుదైన ఘనత కూడా ఉంది.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వేంకటేశ్వరుడికి అలంకరించే ఏరువాడ జోడు పట్టు పంచెలు ఇక్కడి నుంచే వెళ్లడం, ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం సందర్భంగా మూలమూర్తికి ఈ పంచెలను అలంకరించడం విశేషం. 400 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది.

తుంగభద్ర, కృష్ణా నదుల మధ్యలో గద్వాల ఉండటంతో ఈ పంచెలకు ఏరువాడ పంచెలు అని పేరు వచ్చింది. గద్వాల సంస్థానాధీశుడు కృష్ణారావు భూపాల్‌తో మొదలైన ఈ సంప్రదాయం తర్వాతి వారసులు సైతం దీనిని కొనసాగిస్తున్నారు.

దీనిలో భాగంగా ఈసారి కూడా నేతన్నలు ఏరువాడ జోడు పంచెలు సిద్ధం చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) అప్పగించారు. దసరా బ్రహ్మోత్సవాల్లో మరోసారి తిరుపతి వెంకన్న గద్వాల జోడు పంచెలను కట్టి పులకించనున్నాడు.

పట్టు పంచెల తయారీ ఇలా..

ఐదుగురు చేనేత కార్మికులు 41 (మండలం) రోజులు నిష్టతో పట్టు పంచెలు నేస్తారు. వీరికి మరో ఇద్దరు సాయం అందిస్తారు. నామాల మగ్గంపైనే పంచెలను నేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసంతో ఉండి పనిచేస్తారు. వీరు నేసిన జోడు పంచెలు శ్రీవారికి ఇష్టమైనవని వేదపండితులు చెప్తారు.

ఈ పంచెలను స్వామివారి నుంచి తీసిన తర్వాత కూడా సుగంధ పరిమళం వస్తుంది. ఒక్కో పంచె పొడవు 11 గజాలు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. నేతకారులు పంచెలను తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిన తర్వాత అక్కడి ప్రధాన అర్చకుడు ‘ఏరువాడ జోడు పంచెలు అందాయి. మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన వాటిని అలంకరిస్తాం’ అంటూ మూలమూర్తి చెవిలో చెప్తారు. అనంతరం వాటిని భద్రపరుస్తారు.