calender_icon.png 29 September, 2024 | 5:49 AM

గడ్కరీ రూటే సపరేటు

29-09-2024 01:46:27 AM

  1. ఉన్నది ఉన్నట్టు చెప్పే బీజేపీ నేత
  2. ఇతర కమలం నేతలకు పూర్తి భిన్నం
  3. పార్టీలో ఆయన మాటకు ఎంతో విలువ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎవరికీ లేనంత చరిష్మా ఉండొచ్చుగాక.. అమిత్ షా అపర రాజకీయ చాణక్యుడిగా పేరు పొందవచ్చుగాక.. ఇతర నేతలు ఎన్ని ప్రచారాలు, సంచలన ప్రకటలు చేయవచ్చుగాక.. ఆ పార్టీలో ఒకే ఒక్క నేత మాటకు ప్రజలు అత్యంత విలువ ఇస్తారు.

ఆయనే నితిన్ గడ్కరీ. బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు. ప్రస్తుతం కేంద్రమంత్రి. రాజకీయాల్లో గడ్కరీ రూటే సపరేటు. ఆయన ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలకు కూడా ఒకేరీతిన చురకలు వేయగలరు.  

ఆయన అదోరకం

బీజేపీ సైద్ధాంతిక మెంటార్ ఆరెస్సెస్‌కు నితిన్ గడ్కరీ అత్యంత సన్నిహితుడు. ఆయన గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మోదీ, షా యుగం ప్రారంభం కావటంతో ఆయన ప్రభావం కాస్త తగ్గింది. కానీ, ఇప్పటికీ బీజేపీలో, ఆరెస్సెస్‌లో ఆయన మాటకు చాలా విలువ. లోక్‌సభ ఎన్నికల సమయంలో తనను ప్రధానిని చేస్తామని ప్రతిపక్ష పార్టీలు ఆఫర్ ఇచ్చాయని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి.

అంతలోనే ఆయన ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు దేశంలో రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్స్‌గా మారిపోయాయని శుక్రవారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. దీంతో ఆయన అన్నది మోదీ, షా గురించేనా అనే చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నవారు విమర్శలను కూడా స్వీకరించాలని ఈ నెల 20న కూడా ఓ ప్రకటన చేశారు. 

మేం గెలువకపోవచ్చు

నేటి రాజకీయాల్లో ఒక్క సీటు గెలువలేని పార్టీలు కూడా అధికారం మాదే నని ఊదరగొడుతుంటాయి. కానీ, నితి న్ గడ్కరీ వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజే పీ గెలువకపోవచ్చని ప్రకటించి సంచలనం సృష్టించారు. జూలైలో బీజేపీ నేత ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. గతంలో చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నామని.. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.

దీంతో బీజేపీ నేతలే అవాక్కయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కష్టపడి పనిచేసేవారికి గౌరవమే లభించటంలేదని వ్యాఖ్యానించారు. సిద్ధాంతా నికి కట్టుబడి పనిచేసే రాజకీయ నాయకులకు సొంత పార్టీలో కూడా విలువ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.