- ఆయన స్ఫూర్తి గుండెల నిండా ఉంటుంది
- సమాజమే కుటుంబమని సామాజిక సమస్యలపై పోరాడారు
- మహాత్మాగాంధీనే పొట్టనపెట్టుకున్న వారిని అవార్డులివ్వమని యాచించం
- నెక్లెస్ రోడ్‌లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటుపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటాం
- రవీంధ్రభారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): కంచె ఐలయ్య లాంటి వారు కళాలలతో స్ఫూర్తినిస్తే.. గళం, గజ్జెలతో తెలంగాణ సమాజానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గద్దర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి గుండెల నిండా ఉంటుందన్నారు. సమాజమే కుటుంబమని సామాజిక సమస్యలపై గద్దర్ పోరాడారని, ఆయనకు వచ్చిన గుర్తింపుతో గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహాత్మాగాంధీనే పొట్టన పెట్టుకున్న వారినిని అవార్డులివ్వమని యాచించబోమని, గద్దర్ విలువ వారికేం తెలుసని సీఎం పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. నెక్లెస్ రోడ్‌లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం, గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా రవీంద్రభారతిలో శుక్రవారం ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్భందాలున్నపుడు, నిరాశ, నిస్ప్రుహ, ఒంటరిగా భావించినపుడు తాను గద్దరన్న దగ్గరకు వెళ్లే వాణ్ణని, సమయం వచ్చినప్పుడు ప్రజలు గుర్తించి, అండగా ఉంటారని ఆయన ఎప్పుడూ చెప్పే వారని, ఆయన మాట నిజమైందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో గొప్పవాళ్లు కొద్ది మందే.. గద్దర్ లాంటి వారికి చరిత్రపుటల్లో ఒక పేజీ ఉండేలా నిర్ణయం తీసుకోవాలనేదే తమ ధ్యేయమన్నారు. గద్దర్ జయంతి, వర్ధంతిని అధికా నిర్వహించడం మాత్రమే కాదని, సమాజానికి ఆయన చేసిన సేవలను కీర్తించాలనే ఉద్దేశ్యంతో ఆయన పేరిట అవార్డు ఉంటే సంవత్సరమంతా ఉండాలనే గద్దర్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గద్దర్ కుటుంబానికి కళాకారుల బాధలు తెలుసు కాబట్టే గద్దర్ కూతురు వెన్నెలను సాంస్కృతిక సారథిగా నియమించాం.
నాటి ప్రభుత్వం ఎల్బీ స్టేడియం గేట్లకు తాళం వేసింది
గద్దర్ పుట్టిండు, పోరాడిండు, సేవచేసిండు కానీ.. త్వరగా ఆయన దహన కార్యక్రమాలు నిర్వహించాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఒంటరి కాదు.. తెలంగాణ ప్రజల సందర్శనార్ధం ఎల్బీ స్టేడియంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచాలని తాము ప్రయత్నించామని చెప్పారు.
అయితే నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసింది. గౌరవంగా గేట్లు తెరవాలని కమిషనర్‌కు చెప్పాం. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసి రాత్రంతా నిలబడి, లక్షలాది మంది వచ్చేలా ఏర్పాట్లు చేశాం.
ఒక మాట, పాటతో లక్షల మందిని నడిపంచే గొంతు గద్దర్..
ఒక మాట, పాటతో లక్షల మందిని నడిపించే గొంతు గద్దర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఆయన పుట్టడం అందరి అదృష్టం.. ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, గద్దర్‌కు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పారు. ఉగాది సందర్భంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గద్దర్ పేరిట పెద్ద ఎత్తున తెలుగు సినిమా రంగంలో అవార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు.
గద్దర్‌ను నేటి గాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్దర్ భార్య విమల, కూతురు వెన్నెల, సూర్యం, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, గోరటి వెంకన్న, సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, వెన్నె మాధవరావు, కంచె ఐలయ్య, ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, యాదగిరి, జయరాజ్, డీజీ నర్సింహరావు, బెల్ల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మీ పార్టీ ఆఫీసు ఉన్న గల్లీకి గద్దరన్న పేరు పెడుతా..
తెలంగాణ సమాజానికి అందించిన సేవలను గుర్తించి గద్దర్, అందెశ్రీ, చుక్కారామయ్య, గోరటివెంకన్న, జయధీర్ తిరుమల్‌రావుకు పద్మ అవార్డులు ఇవ్వాలని ఇటీవల కేంద్రానికి పంపించాం. వారు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు.. వారు ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన ఐదుగురి కంటే వీళ్లు ఎందులో తక్కువని విమర్శించారు.
జరిగిన భవిష్యత్‌లో తప్పును సవరిం ప్రధానికి లేఖ రాశా.. కానీ కేంద్రమంత్రిస్థానంలో ఉండి గద్దర్‌కు అవార్డు ఇవ్వం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరోసారి గద్దర్‌ను కించపర్చేలా మాట్లాడితే.. మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ అన్న పేరు పెడుతా.. మీ పార్టీ ఆఫీసు అడ్రస్‌ను కూడా గద్దర్ పేరు మీద మార్పిస్తా అని రేవంత్ హెచ్చరించారు. గతంలో ఉన్నాయన గొప్ప అనుకున్నాడు.
గేటు దగ్గర గద్దర్‌ను కూర్చోబెట్టినాయన గేట్లు చూస్తుండగానే కూలాయి. ఆయన వారసులు లోపల ఉన్నారు. గాయనకే గంత గతి పడితే నీకేం గతి పడుతుందోనని ఎద్దేవా చేశారు. ఓట్లలో విప్లవంలో పోతావని హెచ్చరించారు. సైద్ధాంతిక విభేదాల మీద తిట్టుకునే వారు ఉన్నారు కానీ అహంకార పూర్వకంగా వ్యవహరించడం సరికాదన్నారు. వందేండ్ల ఓయూకు దళితుడిని వీసీగా నియమించాం. సామాజిక న్యాయాన్ని గుర్తుచేసుకుని చేశాం.