స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, జనవరి 31: గద్దర్ అనేది ఒక పేరు కాదు అది ఒక కెరటం సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పాట రూపంలో తిరగబడిన బల్లెం అని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వికారాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారధి, భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో నిర్వహించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ 77వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ గద్దర్ తో రాజకీయ నాయకులకు సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండవచ్చు కానీ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం కోసం గద్దర్ పోరాడిన బాట మాత్రం అందరికీ ఆదర్శం అన్నారు.
దొరతనాన్ని ఎదిరించి గజ్జ కట్టి పాట పాడినా,తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఊరురా తిరుగుతూ చైతన్యవంతం చేసినా అది సమాజాన్ని మేల్కొల్పే ఉద్యమమే అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక గద్దర్‌ను కళాకారుడిగా తెలంగాణ ఆస్తిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు హెల్మెట్ ధరించాలి
వికారాబాద్: రోడ్డు భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం వికారాబాద్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ లో హెల్మెట్ ధరించి స్పీకర్ పాల్గొన్నారు. వాహనాల దారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. విద్యార్థులకు చిన్నప్పటినుండే రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.