దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ‘విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు’ అనే నినాదంతో ఈ సినిమా రూపొందింది. ఇది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.సత్యారెడ్డి దర్శక నిర్మాతగానూ.. హీరోగానూ నటించారు. గద్దర్ ఈ చిత్రంలో నటించడమే కాకుండా మూడు పాటలు స్వయంగా ఆలపించారు.
ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటన నేపథ్యంలో సత్యారెడ్డి మాట్లాడుతూ.. “విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అక్కడ భూనిర్వాసితులకు న్యాయం జరగాలని మూడేళ్లు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, మేధావులు, భూ నిర్వాసితులు వంటివారెందరో నటించిన ఈ సినిమాను 200కు పైగా థియేటర్లలో విడుదల చేయనున్నాం” అని తెలిపారు.