calender_icon.png 27 December, 2024 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గద్దర్ అవార్డులు’ గర్వకారణం

01-08-2024 12:05:00 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న కృషిపై చిత్ర పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పరిశ్రమలో విశేష సేవలందించిన కళాకారులకు ‘గద్దర్ పురస్కాలు’ ప్రదానం చేస్తామని మరోమారు వెల్లడించిన దరిమిలా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్), తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) బాధ్యులు స్పందించారు. ఈ మేరకు బుధవారం రెండు సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి.

నటుడిగా, ప్రజా సేవకుడిగా, జానపద కళాకారుడిగా గద్దర్ తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన సినీ అవార్డులను ఇకపై ప్రతి ఏటా ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ముదావహమని తెలిపారు. గద్దర్ అవార్డ్స్ గైడ్‌లెన్స్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)కి అందజేశామని ఉభయ సంస్థలు పేర్కొన్నాయి. ఫిలిం మేకర్స్ తరఫున త్వరలో ఒక కమిటీని నియమిస్తామని తెలిపారు. ఎఫ్‌డీసీని సంప్రదించి అవార్డుల కమిటీ తయారు చేసే మార్గదర్శకాలను సంబంధిత శాఖా మంత్రికి త్వరలో చేరేలా చూస్తామని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శులు దామోదర్ ప్రసాద్, శివప్రసాద్‌రావు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.