13-03-2025 01:32:14 AM
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవా రం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఏప్రిల్ నెలలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
“గద్దర్ అవార్డుల కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కమిటీ విధి విధానాలను పూర్తి చేసింది. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత 2014 నుంచి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫిల్మ్ అవార్డు 2023 వరకు ఇవ్వనున్నాం. అలాగే తెలుగు తో పాటు ఉర్దూ సినిమాలకు అవార్డుల్లో ప్రాధా న్యత ఉంటుంది. నంది అవార్డ్స్‌కు ఏ గైడ్ లైన్స్ ఉన్నాయో అలాగే చిన్న చిన్న మార్పులతో గద్దర్ అవార్డ్స్‌కు కూడా అలాంటి గైడ్‌లైన్స్ ఉన్నాయి.
ఏప్రిల్‌లో అవార్డుల ఫంక్షన్ ఘనంగా జరుపుకుందాం. గతంలో 2014 సింహా అవార్డుల కోసం అప్లికేషన్ ఇచ్చి డబ్బు చెల్లించడం జరిగింది. వారికి ఎఫ్‌డీసీ నుంచి తిరిగి చెల్లింపులు అవుతాయి. వన్ వీక్‌లో అవార్డులను జ్యూరీ ఫైనల్ చేస్తుంది.
గద్దర్ అవార్డ్ నమూనా కూడా సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి అద్భుతమైన ఈవెంట్ జరగబోతోంది. అవార్డులు ఎవరైనా ఇవ్వొచ్చు. ఫిలిం ఛాంబర్ కూడా ఇస్తోంది. మనం ఏ పని చేసినా 51 శాతం పాజిటివ్‌గా ఉంటే చాలు. నెగిటివ్ ప్రచారాలు అనవసరం” అన్నారు.