14-02-2025 01:59:42 AM
తోల్కట్ట తోటలో కోడిపందేలు, క్యాసినోలతో కాయ్ రాజా కాయ్
ఫాంహౌస్ యజమాని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
రంగారెడ్డి/చేవెళ్ల, ఫిబ్రవరి13 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలోని ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఫాం హౌస్‌లో పోలీసులు దాడులు చేయడం, దాడుల్లో క్యాసినో బెట్టింగ్స్, కోడిపందేలు వెలుగు చూడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
బెట్టింగ్స్ సూత్రధారిగా భావిస్తున్న భూపతిరాజు శివకుమార్ అలియాస్ గబ్బర్‌సింగ్‌ను పోలీసులు ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. నిందితుడిపై సెక్షన్ అండ్ 4 గేమింగ్ యాక్ట్, సెక్షన్ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు రెండేళ్ల నుంచి గుట్టుచప్పు డు కాకుండా ఫాంహౌస్‌లో కోడి పందేలు, క్యాసినో జూదాలకు తెరతీశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫాంహౌస్‌లో కోడి పందేలు, క్యాసినో గేమ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచా రం అందుకున్న మొయినాబాద్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే రూ.కోటి విలు వైన బెట్టింగ్ కాయిన్లు, 84 పందెం కోళ్లు, 46 కోడి కత్తులు, 55 లగ్జరీ కార్లు, 64 మొబైల్స్, పేకాట కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. జూదరులు యూపీఐ మాధ్యమంగా లావాదేవీలు నడిపినట్లు గుర్తించారు. నిందితులందరికీ నోటీసులు జారీ చేశారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
ఫాంహౌస్ యజమాని శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి పోలీసులు..
బీఆర్‌ఎస్‌లో గుర్తింపు ఉన్న నేతగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పేరుంది. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడం ఇప్పుడు రాజకీయపరంగా దుమారం రేపుతున్నది. ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూసిన నేపథ్యంలో పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆ ఫాంహౌస్ యజమాని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చారు.
నాలుగు రోజుల్లో ఫామ్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ లీజుకు ఇచ్చిన డాక్యుమెంట్లను పోలీసులకు అందించారని తెలిసింది. మరోవైపు శ్రీనివాస్‌రెడ్డి 2018లో తోల్కట్ట గ్రామ రెవెన్యూ సర్వేనంబర్ 165/ఏ లోని 10 ఎకరాలకు పైగా ఉన్న భూమిని చెన్నకేశవువులు, కళావతి అనే వ్యక్తుల నుంచి కోనుగోలు చేశానని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
కేటీఆర్‌కు తలనొప్పిగా వ్యవహారం..
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌లో క్యాసినో బెట్టింగ్, కోడి పందేల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కొత్త చిక్కులు వచ్చినట్లయింది. ఆయనకు సన్నిహితుడిగా శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే పేరుండడంతో వ్యవహారం రాజకీయపరంగా విమర్శలకు దారి తీస్తున్నది.
శంకరపల్లి మండలంలోని జవ్వాడ ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీ జరిగిందని, ఈ వ్యవహారంలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికారిక కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం మరువకముందే తోల్కట్ట ఫాంహౌస్ వివాదం తలెత్తడం కేటీఆర్‌కు తలనొప్పిగా మారింది.
ఫాంహౌస్‌లపై ప్రత్యేక నిఘా..
తోల్కట్ట ఫాంహౌస్‌లో కోడిపందేలు వెలుగు చూసిన నేపథ్యంలో పరిసర ప్రాం తాల్లోని ఫాంహౌస్‌లు, విల్లాలు, వ్యవసాయ క్షేత్రాలపైనా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టా రు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ పవన్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
అది ఫాంహౌస్ కాదు.. అక్కడ అతిథి గృహమూ లేదు..
నాకు తోల్కట్ట రెవెన్యూ సర్వే నంబర్ 165/ఏ లోని 10 ఎకరాల 1 గుంట భూమి ఉంది. సదరు భూమికి రిజిస్టర్ సేల్ డీడ్ కూడా ఉంది. ఎమ్మెల్సీగా నాకు బాధ్యతలు ఉన్నందున నేను భూవ్యవహారాలను జ్ఙాన్‌దేవ్‌రెడ్డి అనే వ్యక్తికి అప్పగించాను. మీడియా ప్రసారం అవుతున్నట్లు అక్కడ ఎలాంటి ఫాంహౌస్ కాదు.
అతిథిగృహమూ లేదు. వ్యవసాయ పనిముట్లు భద్రపరిచేందుకు, కూలి పనిచేసే వారి వసతి కోసం రెండు గదుల ఇల్లు మాత్రమే ఉంది. జ్ఞాన్‌దేవ్‌రెడ్డి కొంతకాలం క్రితం వర్కా రమేశ్‌కుమారెడ్డి అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు పోలీసుల దాడుల తర్వాత తెలిసింది. తర్వాత రమేకుమార్‌రెడ్డి సైతం వెంకటపతిరాజు అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చినట్లు తెలుసుకున్నాను.
పోలీసులు దాడులు చేసిన సమయంలో నేను వరంగల్ జిల్లాలో జరిగిన ఆధ్యాత్మిక వేడుకలకు వెళ్లాను. నేను తోటలో అడుగు పెట్టే ఎనిమిదేళ్లవుతుంది. తోల్కట్ట అసాంఘిక కార్యకలాపాల్లో నా ప్రమేయం లేదు. తోటలో జరిగిన ఘటనలపై పోలీసులు విచారించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, భూ యజమాని