కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: 5జీ సాంకేతికత 2040 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా 450 బిలియన్ డాలర్ల సొమ్మును తీసుకొస్తుందని కేంద్ర టెలికామ్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటుచేసిన గ్లోబల్ స్టాండరడ్స్ సింఫోజియంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో అతిపెద్ద టెలికం ఈవెంట్లలో ఇదొకటి.‘ఒక్క భారత్లోనే 2040 నాటికి 5జీ ద్వారా 450 బిలియన్లు సమకూరతాయని అంచనాలున్నాయి. ఇది కేవలం వేగవంతమైన ఇంటర్నెట్ లేదా లో లేటెన్సీ ఉన్నది కాదు.. స్మార్ట్ సిటీలకు అవసరమైన క్షేత్రస్థాయి పని దీనితోనే సాధ్యం.
అత్యాధునిక మౌలిక వసతులు, ‘అటానమస్’ ఆవిష్కరణలకు ఇది చాలా ముఖ్యం. ఇప్పటికే దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. కేవలం 22 నెలల్లోనే 98శాతం జిల్లాలు, 80శాతం జనాభా దీని పరిధిలోకి వచ్చాయి. భారత్‌లోని మార్పునకు ఇదే చిహ్నం.
హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయంలో అత్యాధునిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ సహకారంతో 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ పూర్తి శక్తుల్ని వాడుకలోకి తెచ్చుకోవచ్చు’ అని సింధియా పేర్కొన్నారు.
ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విషయంలో బలమైన నిబంధనలు అవసరమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఈక్రమంలో వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు నైతిక అంశాలు, రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అవసరమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఆవిష్కరించనున్న 6జీని దృష్టిలోపెట్టుకొని ఇవి సమగ్రంగా ఉండాలన్నారు. 5జీ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు.. భాగస్వామ్యాల ఏర్పాటులో ప్రపంచదేశాలు కృషి చేయాలని కోరారు.