మాజీ ఎంపీ మీడియం బాబురావు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ప్రజలను కలుపుకొని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మంచి కంటి భవన్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి పూర్తిస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపించారు. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఇచ్చిన హామీ నుండి ఎలా వైదొలగాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అనిపిస్తుందని ఆయన ఆరోపించారు.
రైతుబంధు ప్రభుత్వం ప్రకటించిన విధంగా కాకుండా కోత విధించడం రైతులను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను సహించలేక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా అగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకై క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజే రమేష్ ఎం జ్యోతి లిక్కీ బాలరాజు కే బ్రహ్మచారి అన్నవరపు సత్యనారాయణ రేపాకుల శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ కె శ్రీధర్ దొడ్డ రవి భూక్య రమేష్ వీర్ల రమేష్ కొండబోయిన వెంకటేశ్వర్లు కాలంగి హరికృష్ణ తులసిరామ్ ఎస్ లక్ష్మి సత్య కుమారి తదితరులు పాల్గొన్నారు.