calender_icon.png 28 October, 2024 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నార్థకంగా నీట్ విద్యార్థుల భవిష్యత్

16-09-2024 12:09:00 AM

జీవో నంబర్ ౩౩ని  ఉపసంహరించుకోవాలి

మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం 

అరెస్ట్ చేసి బొల్లారం స్టేషన్‌కు తరలించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వైద్య విద్యలో స్థానికతను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33తో నీట్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ నుంచి మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ నాయకులు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం పలువురు విద్యార్థి నాయకులు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వెళ్లారు.  ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకోసమే జీవో 33ను కొనసా గించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిందన్నారు. 33ను వెంటనే ఉపసం హరించుకుని ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లను చేపట్టాలన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల యాభై శాతం కన్వీనర్ కోటా సీట్లు నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు.

దీంతో ఇతర రాష్ట్రాల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు కన్వీనర్ కోటాలో సీటు కోల్పోయే అవకాశం ఉందని, ప్రైవేటు కాలేజీలకు లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటున్న వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి, శిగవెంకట్ గౌడ్, పడాల సతీష్, కార్యదర్శులు దశరథ్, కే జంగయ్య, పల్లయ్య, మైపాల్ , అవినాష్, ప్రశాంత్, నరేష్, రమన్ , షఫీ తదితరులు పాల్గొన్నారు.