22-03-2025 08:25:48 PM
అసెంబ్లీలో ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి పర్యటకశాఖగా అభివృద్ధి పరచాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. మంజీరా నది తీరం ఒ డ్డున వెలిసిన సంగమేశ్వర ఆలయం, నల్ల పోచమ్మ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు, మంజీర నదిలో బోటింగ్ సిస్టమును ఏర్పాటు చేసి ఏకో టూరిజం గా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. నల్ల పోచమ్మ ఆలయ సమీపంలో ప్రభుత్వ అసైన్డ్ భూమి సైతం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు.
ఇందుకు సంబంధించి గతంలో 15 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలను ప్రభుత్వానికి అందించామని తెలిపారు. ఖేడ్ ప్రాంతంలో ఏకో టూరిజం సంబంధించి అనేక ప్రాచీన ఆలయాలతో పాటు పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో బీదర్ ఖిల్లా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నారాయణఖేడ్ ప్రాంతం వెనుకబడినందున అభివృద్ధి చేపట్టి స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఎమ్మెల్యే బోరంచ పోచమ్మ ఆలయం గురించి అసెంబ్లీలో మాట్లాడడంతో నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే నారాయణఖేడ్ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందే అవకాశాలతో పాటు యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక మేధావి వర్గాలు పేర్కొన్నారు.