24-02-2025 07:05:50 PM
స్థానిక సంస్థల్లో వికలాంగులను నామినేట్ చేయాలి..
మార్చి1నుండి 30 వరకు గ్రామాల్లో సంతకాల సేకరణ..
NPRD రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానం..
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తూ ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 1నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని NPRD రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానించింది. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ అధ్యక్షతన హైదరాబాద్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఉద్యమాలు ఉదృతం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున AICC మానిఫెస్టోలో ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయాలని డిమాండ్ చేసింది.
AICC మ్యానిఫెస్టోలో 2024 పేజీ నెంబర్ 9/8 వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ఛత్తీస్ ఘడ్లో, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలు ఉన్న మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు మార్చిలో జరిగే అసెంబ్లీలో సమావేశాల్లో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల కోసం మార్చి 1నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సంతకాల సేకరణ చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సమావేశం నిర్ణయం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 6000 లకు పెంచేందుకు 2025-26 బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ఉచిత బస్ సౌకర్యo అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో RTC యాజమాన్యం నడుపుతున్న అన్ని రకాల బస్లలో వికలాంగుల రాయితీ పాసులను అనుమతించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల సంఖ్య పెరగడం వలన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తుంది.గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి వికలాంగునికి జాబ్ కార్డు ఇచ్చి150 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి వికలాంగునికి యూనిక్ డిసెబుల్డ్ ఐడి కార్డు జారీ చేయాలని, 21రకాల వైకల్యాల వారికి కార్డ్స్ జారీ చేసే విదంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, ఒంటరి వికలాంగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో NPRD రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయమ్మ,జె రాజు,యశోద, స్వామి, ఉపేందర్, అరిఫా, సహాయ కార్యదర్శులు దశరథ్, గంగాధర్, నాగలక్ష్మి,లింగన్న లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.