వనపర్తి, జనవరి 02 ( విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని పలు చెరువుల పటిష్టత కోసం రాష్ర్ట ప్రభుత్వం 2 కోట్ల 43 లక్షల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పెద్దమందడి మండల కేంద్రంలోని పెద్ద చెరువు బలోపేతం కోసం ఒక కోటి 12 లక్షలు, దొడగుంటపల్లి గ్రామ ఊర చెరువు పటిష్టత కోసం 76 లక్షలు, వెల్టూర్ చెరువు పటిష్టత కోసం 66 లక్షల50వేల రూపాయలను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు .
ఈ చెరువులను పటిష్ట పరచడంతో ఆయా గ్రామాలకు సంబంధించిన దాదాపు 1500 నుంచి 2000 ఎకరాలకు నిరాటంకంగా సాగునీరు అందించవచ్చునన్నారు. అన్నదాతల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా సి ఎం రేవంత్ రెడ్డి కి వనపర్తి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన ద్వారా తెలిపారు.