24 May, 2026 | 4:20 PM

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు

24-05-2026 03:29 PM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో క్యాబినెట్ ఆమోదం

 గత ప్రభుత్వం పూర్తిగా ద్రోహం చేసింది..  పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం

 రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ వాకిటి శ్రీహరి

షాద్‌నగర్,(విజయక్రాంతి): ప్రజల చిరకాల వాంఛ అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.583 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ఆదివారం షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృషితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.బోర్లు వేసిన చుక్క నీరు రాని స్థితిలో ఉన్న పాలమూరుకు ప్రాజెక్టు అవసరం ఎంతగానో ఉందని అన్నారు. ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో కలెక్టరేట్లలో సమావేశాల అనంతరం చర్చించి ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ నిర్వహించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తామని అన్నారు.

కెసిఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం..

కెసిఆర్ కు అడ్రస్ లేకపోయినా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడని నమ్మి గెలిపించారని, కానీ కేవలం తమ అవినీతి కోసం ఈ ప్రాజెక్టును వాడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 21 స్టేజీలు నీళ్లు దిగుమతి చేసుకుంటామంటూ కేవలం 18 స్టేజీలకు పరిమితం చేశారని, 58 వేల కోట్లు మంజూరు అయితే కేవలం 28 వేల కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని విమర్శించారు.

పర్యావరణ అనుమతి లేకుండా, భూసేకరణ లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని గత ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.కాలేశ్వరం కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం పాలమూరును ఎందుకు విస్మరించిందో యువత ప్రశ్నించి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కల అని అన్నారు.

రైతులు దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ప్రాజెక్టు కల సాకారమవుతోందని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు సాధన కోసం ఎన్నోసార్లు ధర్నాలు, ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.583 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకమని అన్నారు.