09-04-2025 12:33:39 AM
ఆర్థిక సంఘం మెలికతో మున్సిపాలిటీలకు ఇబ్బంది
మేడ్చల్ జిల్లాలో ఎనిమిదింటికే నిధులు
అభివృద్ధి పనులపై ప్రభావం
మేడ్చల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పన్ను వసూలు మెలిక పెట్టడం పురపాలికలకు ఆశనిపాతంలా తయారైంది. పన్ను వసూలులో లక్ష్యాన్ని చేరుకోలేని పురపాలికలకు ప్రభు త్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15 వ ఆర్థిక సంఘం నిధులు మం జూరు చేయలేదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మూడు పురపాలక సంఘాలకు, రెండు కార్పొరేషన్లకు నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాని పురపాలికల జాబితాలో గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, ఘట్కేసర్ తో పాటు బోడుప్పల్, జవహర్ నగర్ నగర కార్పొరేషన్లున్నాయి.
నిధులు మంజూరు కాకపోవడం పట్ల ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు రావడం లేదు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తాగునీటి సరఫరాకు సం బంధించి మరమ్మతులకు కూడా నిధులు లేవు. దీంతో పట్టణాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. మున్సిపాలిటీలలో రూపా యి ఖర్చు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక సంఘం నిధులు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండేది.
ఎనిమిది పురపాలికలకు నిధులు మంజూరు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆరు పురపాలక సంఘాలు, రెండు కార్పొరేషన్లకు ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. నిజాంపేట్ కార్పొరేషన్ కు రూ. 47 లక్షలు, పీర్జాదిగూడ కార్పొరేషన్ కు రూ. 40.81 లక్షలు, మున్సిపాలిటీలలో దమ్మాయిగూడకు కు రూ.45.85 లక్షలు, దుండిగల్ కు రూ.41.77 లక్షలు, మేడ్చల్ కు రూ.44.63 లక్షలు, నాగారంకు రూ.30.58 లక్షలు, పోచారం కు రూ.37.54 లక్షలు, తూముకుంటకు రూ.36.59 లక్షలు మంజూరయ్యా యి.
ఆర్థిక సంఘం నిధులు మంజూరుతో ఈ పురపాలికలకు ఊరట కలిగింది. ఈ నిధులతో అత్యవసర పనులు చేపట్టేందుకు అవకాశం కలిగింది. ముఖ్యంగా వేసవికాలం కావడంతో తాగునీటి సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవడానికి, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ ఏర్పాటు చేయడానికి నిధులు అందుబాటులో ఉండనున్నాయి. వర్షాకాలంలో వరదలు రాకుం డా ముందస్తు చర్యలు చేపట్టడానికి అవకాశం కలగనుంది.