19-04-2025 01:44:46 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందని, జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మొత్తం 1023 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశామని పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లలో 300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సహాయం లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించు కోవాలని, ప్రభుత్వం నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తుందని, హౌసింగ్ శాఖ అధికారులు నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వేగంగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.