calender_icon.png 11 March, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల దుమారం

21-02-2025 12:00:00 AM

భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు గత బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ఆరోపణ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు యూఎస్ ఎయిడ్ అందించే 21 మిలియన్ డాలర్ల (రూ.182 కోట్ల) నిధులను ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా డోజ్ విభాగం ఇటీవల రద్దు చేసిన విష యం తెలిసిందే.

డోజ్ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన ట్రంప్ గత బైడె న్ సర్కార్‌పై ఈ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 42 బిలియన్ డాలర్ల నిధులు కలిగి ఉన్న అమెరికా స్వతంత్ర ఎయిడ్ ఏజన్సీ (యూఎస్‌ఎయిడ్) భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుందనేది ట్రంప్ ఆరో పణ. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లాంటి పలు దేశాలకు యూఎస్‌ఎయిడ్ అందించే 723 మిలియన్ డాలర్ల నిధులకు డోజ్ కత్తెర వేసింది.

అయితే ట్రంప్ ఆరోపణల్లో నిజమెంతనేది రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై జరిగే దర్యాప్తులో తేలనుంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌లో ఎన్నికల్లో ఖర్చు చేసే లక్షల కోట్లతో పోలిస్తే 182 కోట్లు చాలా చిన్న మొత్తమనే చెప్పాలి. అయితే భారత ఎన్నికల్లో ఈ సొమ్మును యూఎస్‌ఎయిడ్ ఎందుకు ఉపయోగించాలని అనుకొంది, ఈ నిధులు ఎవరికి అందాయి, అన్నిటికన్నా మించి ఇంత చిన్న మొత్తం భారత ఎన్నికల ఫలితాలను మార్చగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి.

ఒక అంచనా ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల్లో  ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు. అంటే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చేసిన ఖర్చుకన్నా ఇది ఎక్కువ. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఉద్యోగులు, బలగాల సమీకరణ, వారికి శిక్షణతో పాటుగా ఓటర్లలో ఓటుపై అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యం పెంచడం లాంటి వాటిపై ఎన్నిక కమిషన్, కేంద్రం ఈ మొత్తం ఖర్చు చేసింది.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చు దీనికి ఎన్నో రెట్లు ఎక్కువే ఉంటుందనేది అనధికారిక అంచనా. మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలకన్నా కూడా మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా ఎక్కువే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఓటుపై అయిన ఖర్చు రూ.1400కు చేరుకుందని ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ గణాంకాలు చెబుతున్నాయి.

కాగా గతంలో ఎస్‌వై ఖురేషీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నప్పుడు యూఎస్‌ఎయిడ్ నిధులు మంజూరు చేసిన సంస్థకు, ఈసీకి మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. అయితే ఇందులో డబ్బులకు సంబంధించిన లావాదేవీ ఏదీ లేదని, యూఎస్ ఎయిడ్ నిధులను దేశంలో ఓటర్ల భాగస్వామ్యాన్నిపెంచడం కోసం మాత్ర మే ఉపయోగించడం జరిగిందని ఖురేషీ వివరణ ఇచ్చారు.

 అయితే ఈ నిధులు ఎరికి దక్కాయనేది ప్రశ్న. ఒక వేళ నిధులు ఎవరికో అందాయనే అనుకున్నా అది ఈ దేశ ఎన్నికల ఫలితాలను తారుమా రు చేయగలుగుతుందా? అయితే ఈ మొత్తం చిన్నదే కావచ్చు కానీ క్షణాల్లో సమాచారం వందల మందికి చేరే నేటి సోషల్ మీడియా ప్రపంచంలో కీలక నియోజక వర్గాల్లో ఎటూ తేల్చుకోని ఓటర్లను ప్రభావితం చేయగలదనే వాదన ఉంది.

దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో కుట్రలు చేయవచ్చని మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత బిల్‌గేట్స్ ప్రధాని మోదీని హెచ్చరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. కాగా గతంలో వెనిజులాలాంటి దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అమెరికా ప్రయత్నించిదన్న ఆరోపణలు వచ్చాయి.

ఇలాంటి ఆరో పణలు కొత్తేమీ కాదు. పొరుగు దేశాల ఎన్నికల ఫలితాల ప్రభావం తమ దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై ప్రభావం చూపుతాయని భావించినప్పు డు ఆయా దేశాలు ఇలాంటి జోక్యానికి ప్రయత్నించడం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ భారత ఎన్నికల్లో విదేశీ జోక్యం ఆరోపణలు రావడం, అదీ అగ్రరాజ్యం అధినేత నుంచి రావడంతో వీటికి ప్రాధాన్యత లభించింది. దీనిపై అప్పుడే అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల పర్వం మొదలైంది.