calender_icon.png 25 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీకి నిధులివ్వండి

25-01-2025 01:15:09 AM

రూ.10వేల కోట్లు కావాలి

  1. మెట్రో ఫేజ్-2ను జేవీగా చేపట్టాలి
  2. కారిడార్ల డీపీఆర్‌ను ఆమోదించి, నిర్మాణానికి సహకరించాలి
  3. హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ స్కీమ్‌లకు నిధులు కేటాయించాలి
  4. పీఏఎంవై కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి
  5. కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి

* ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఫేజ్-1 కింద తెలంగాణకు కేవలం 1.58 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. ఇది మొత్తం మంజూరులో 0.79 శాతమే. భారతదేశ పట్టణ జనాభాలో తెలంగాణ 8 శాతం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరో 24 లక్షల ఇండ్లను పొందడానికి అర్హత ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలి. 

 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీలో మురుగు చేరకుండా నదికి ఇరువైపులా కాలువలు, బాక్స్ డ్రెయిన్లు, ఎస్టీపీల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు.

ఇందుకోసం రూ.10 వేల కోట్లను కేంద్రం కేటాయించాలని విన్నవించారు. శుక్రవారం హైదరా బాద్‌లో ఐటీసీ కాకతీయలో సీఎం రేవం త్ రెడ్డితో కలిసి పీఏఎంవై (యూ), పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై ఖట్టర్ సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ర్టమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నదన్నారు.

అందుకే రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. దేశంలోని మహా నగరాలైన ఢిల్లీ, చెన్ను, బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్‌లో మెట్రో కనెక్టవిటీ తక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్ -2 కింద ఆరు కారిడార్లను గుర్తించామని చెప్పారు.

ఇందులో నాగోల్--శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి. మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ --చాంద్రా యణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్- -పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్బీనగర్-- హయత్‌నగర్ (7.1 కి.మీ), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం --ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) (40 కి.మీ.) ఉన్నాయన్నారు. 

ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవు తాయని, డీపీఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సం యుక్త భాగస్వామ్యం (జేవీ) కింద చేపట్టి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 

సమగ్ర మురుగునీటి ప్లాన్..

హైదరాబాద్ నగరంతో పాటు సమీపంలోని 27 పట్టణ పాలక సంస్థల పరిధి లో మురుగు నీటి నెట్‌వర్క్ నిర్మాణానికి రూ.17,212 కోట్లతో సమగ్ర మురుగునీటి మేజర్ ప్లాన్ (సీఎస్‌ఎంపీ) తయారు చేశామని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా సీఎస్‌ఎంపీని గుర్తించి నిధులు స మకూర్చాలన్నారు.

రాష్ర్టంలో రెండో పెద్ద న గరమైన వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ నగరంలో రూ.4,170 కోట్లతో సమగ్ర భూగర్భ నీటి పారుదల (యూజీడీ) పథకాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

లక్ష సౌర పంపులు కేటాయించాలి

రాష్ర్టంలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కేంద్రమంత్రిని రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రానికి కుసుమ్ -సీ ఎఫ్‌ఎల్‌ఎస్ కాంపొనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలన్నారు.

విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో 9 ప్రాజె క్టు నివేదికలను కేంద్రానికి సమర్పించామని, వాటిని వెంటనే మంజూరు చేయాలన్నారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీం (ఆర్డీఎస్‌ఎస్)లో తెలంగాణ డిస్కమ్‌లను చేర్చాలని విన్నవించారు.

రాష్ర్ట విద్యుత్ సంస్థలకు వి ద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), గ్రా మీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ఇచ్చిన రుణాలకు  సంబంధించిన వడ్డీ రేట్ల ను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కొత్త పు నరుత్పత్తి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెం డు సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని..

అందుకే ఆర్‌పీపీవో లక్ష్యాలను చే రుకోలేకపోయినందుకు విధించే జరిమానా లు మాఫీ చేసి సహకరించాలన్నారు. అలాగే, పునరుత్పత్తి విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌కు అవసరమయ్యే నిధులను కేంద్ర ఇవ్వాలన్నారు.

సమీక్షలో రాష్ర్ట గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్, ప్రజాసంబంధాలు) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.  

ముఖ్యమంత్రిని అభినందించిన కేంద్రమంత్రి

తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి ఖట్టర్ అభినందనలు తెలిపారు. ప్రధాని దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలంటున్నారని, అందులో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మీరిచ్చిన ఇండ్లు 0.79 శాతమే! 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఫేజ్-1 ప్రకారం దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఇండ్లను మంజూరు చేసిందని.. అయితే ఇందులో తెలంగాణకు కేవలం 1.58 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేశారని, ఇది మొత్తం మంజూరులో 0.79 శాతమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు చెప్పారు.

భారతదేశ పట్టణ జనాభాలో తెలంగాణ 8 శాతం కలిగి ఉందని, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరో 24 లక్షల ఇండ్లను పొందడానికి అర్హత ఉందని, ప్రధాన మంత్రి  ఆవాస్ యోజన అర్బన్ పథకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంత్రి పొంగులేటి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఇండ్ల మంజూరు విషయంలో పలు అంశాలను కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు.

అక్కడి నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులిద్దరూ కరీంనగర్‌కు వెళ్ళారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తరువాత కూడా కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రాష్ట్రంలో హౌజింగ్ విషయంపై మంత్రి పొంగులేటి పలు అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గడిచిన పదేండ్లలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దీనితో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీగా డిమాండ్ ఉందని మంత్రి విన్నవించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలని పొంగులేటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హౌజింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులను ఇతర శాఖలలో సర్దుబాటు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఇందుకోసం గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించి, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

అర్హులైన ఇండ్లులేని వారు 44 లక్షలు..

ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలో అర్హత పొందిన ఇండ్లులేని వ్యక్తులు సుమారు 44 లక్షల మంది వరకు ఉన్నారని మంత్రి పొంగులేటి కేంద్ర మంత్రి ఖట్టర్‌కు తెలిపారు. లబ్ధిదారుల అర్హత, జియో ట్యాగింగ్, వారి ప్రస్తుత నివాసం వంటి విషయాలను డాక్యుమెంటేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీనితో ఇంటింటి సర్వే నిర్వహించామని, 360 డిగ్రీ టూల్‌తో డెస్క్ వెరిఫికేషన్ జరిగిందని, తుది జాబితాను రూపొందించేం దుకు గ్రామ సభలు నిర్వహించినట్టు మంత్రి ఈ సందర్భంగా వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతుందని, 26 జిల్లాల్లోని 6867 గ్రామాలను ఇటీవల యూడీఏ కిందకు తీసుకొచ్చామని, వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో చేర్చాలని కేంద్ర మంత్రిని కోరారు.