టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు..
టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు
అదనపు ఐపీఎస్ పోస్టులు కావాలి
సీఆర్పీఎఫ్, జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించండి
కేంద్ర హోం మంత్రి షాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ర్టస్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో రేవంత్‌రెడ్డి గురువారం కలిశారు. సుమారు గంటపాటు సాగిన వీరి భేటీలో వివిధ అంశాలను షా దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు కావల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ.88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాలని కోరారు. ఐదేళ్లకు ఒకసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసరి అని, తెలంగాణకు సంబంధించి 2016లో మొదటిసారి సమీక్ష నిర్వహించారని, నాటి నుంచి సమీక్ష చేయనుందున వెంటనే సమీక్ష చేయాలని విన్నవించారు.
29 మంది ఐపీఎస్‌లను కేటాయించాలి
రాష్ర్ట విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ర్ట అవసరాలకు ఐపీఎస్‌లు సరిపోనందున అదనంగా మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని సీఎం విజప్తి చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా ఇలాంటి క్యాంపులను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గతంలో ఉండి, ఆ తర్వాత తొలగించిన మూడు జిల్లాలను ఎస్‌ఆర్‌ఈ కింద (భద్రతాపరమైన వ్యయం, చెల్లింపులు) తిరిగి కొనసాగించాలని కోరారు. పొరుగు రాష్ట్రాలతో సుదీర్ఘ సరిహద్దు ఉండటంతో తెలంగాణ భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
నక్సల్స్ అణచివేతపై దృష్టిసారించాలి
తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని అణిచి వేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆర్ఫీఎఫ్, జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అమిత్ షాకు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రె గుట్టల్లో ఉన్న అనుకూలతను ఆసరాగా చేసుకొని సీపీఐ మావోయిస్టు కమిటీ ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి ప్రాబ్యల విస్తరణకు ప్రయత్నిస్తోందని తెలిపారు. మావోయిస్టు ప్రత్యేక దళం నిర్మూలనకు జేటీఎఫ్ క్యాంపులు ఉపయోగపడతాయని చెప్పారు. ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులను కాకుండా వేరే 1,065 మందిని చేర్చుకోవడానికి నిబంధనలు సడలించాలని విన్నవించారు.
పునర్విభజన సమస్యలను తీర్చండి
పెండింగ్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాల ని అమిత్ షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. షెడ్యూ ల్ 9లోని (53, 68, 71 సెక్షన్ల ప్రకారం) ప్రభు త్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ ౧౦లోని సంస్థల వివాదం (75 సెక్షన్ ప్రకా రం) సామరస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున, అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి విన్నవించారు.