మూసీ అభివృద్ధికి 4 వేల కోట్లు
ఉస్మాన్, హిమాయత్ సాగర్లకు 6 వేల కోట్లు
నల్లాల కనెక్షన్ల కోసం 16,100 కోట్లు అవసరం
గ్యాస్ సబ్సిడీపై ఓఎంసీలకు ఆదేశాలు ఇవ్వండి
పౌరసరఫరాల శాఖ బకాయిలు విడుదల చేయండి
కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
సీఆర్ పాటిల్, హర్‌దీప్‌సింగ్, జోషీతో భేటీలు
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మ కంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.౪ వేల కోట్లు కేటాయించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని సుందరీకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సోమవారం కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్‌దీప్ సింగ్ పురి, ప్రహ్లాద్ జోషీని వేర్వేరుగా కలిశారు.
రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. మూసీ సుందరీకరణకు సహకరించాలని పాటిల్‌ను కోరారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో భాగంగా దక్కన్ పీఠభూమిలోని నదుల పరిరక్షణ, అభివృద్ధి చేయా లని కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో మూసీలో మురికినీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని కోరారు. గోదావరి జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌ను నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు మరో రూ.6 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువులను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు తీరడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని వెల్లడించారు.
7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదు
జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు నిధులు విడుదల చేయాలని సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇటీవల తాము చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని తేలిందని, ఆ గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు అవసరమని తెలిపారు. 2019లో జల్‌జీవన్ మిషన్ ప్రారంభించినా నేటివరకు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని చెప్పారు. ఈ ఏడాది నుంచి నిధులు విడుదల చేయాలని కోరారు.
రూ.500కే సిలిండర్‌పై వెసులుబాటు ఇవ్వండి
తెలంగాణలో రూ.500కే వంటగ్యాస్ సరఫరాకు సంబంధించిన సబ్సిడీని ముం దుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే సదుపాయాన్ని కల్పించాలని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిని పార్లమెం ట్‌లో సీఎం కలిశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తమ ప్రభుత్వం రూ. 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని తెలిపారు. గ్యాస్ సిలిండర్లకు చెందిన సబ్సిడీని ముందుగానే ఓఎంసీలకు చెల్లించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే వినియోగదారులు రూ. 500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ముం దుగానే రాయితీని తాము ఓఎంసీలకు చెల్లి స్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. అలా వీలుకాని పక్షంలో వినియోగదారులకు తమ ప్రభుత్వం చెల్లించే సబ్సిడీని 48 గంటల్లోపు అందేలా చూడాలని కోరారు.
పెండింగ్‌లో రూ.14,68.94 కోట్ల రాయితీ
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నుంచి రావల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం విజ్ఞప్తిచేశారు. 2014 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.14,68.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. బకాయిపడిన మొత్తాన్ని విడుదల చేయాలని సీఎం కోరారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం, జహీరాబాద్ ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, సురేష్ షెట్కార్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.