పట్టించుకోని శంషాబాద్ మున్సిపల్ యంత్రాంగం
రాజేంద్రనగర్, అక్టోబర్ 15: శంషాబాద్ పట్టణంలో అనధికారికంగా కల్యాణ మండపాలు వెలుస్తున్నాయి. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవం లేదనే విమర్శలు ఉన్నాయి. సదరు యజమానుల నుంచి వారు అందినకాడికి డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శంషాబాద్ హైదరాబాద్ రహదారి పక్కన ప్రస్తుతం పదుల సంఖ్యలో కల్యాణ మండపాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి ట్రాన్స్‌కో, జల మండలితోపాటు ఇతర శాఖల అధికారులు సహకరిస్తూ అందినకాడికి లాగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాళ్లపై కొరడా ఝుళిపించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావును వివరణ కోరగా.. ‘పట్టణంలో అనుమతులు లేకుండా ఫంక్షన్ హాళ్ల నిర్మిస్తే వాటిని నిలిపివేస్తాం. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం’ అని సమాధానమిచ్చారు.