calender_icon.png 21 September, 2024 | 10:26 PM

నిండా ముంచిన ఆక్రమణలు!

06-09-2024 02:02:11 AM

  1. పట్టణాల చుట్టూ చెరువులు, నాలాల ఆక్రమణ 
  2. కోదాడ ముంపునకు చెరువుల ఆక్రమణలే కారణం 
  3. సూర్యాపేటలో నాలా ఆక్రమణలతో మానసానగర్ మునక 

సూర్యాపేట,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరద తాకిడితో సూర్యాపేట జిల్లా మునుపెన్నడు లేని పరిణామాలు చవిచూసింది. ఇందుకు ముఖ్యం గా మానవ తప్పిదాలే కారణమని ఇటీవల వెలుగు చూసిన సంఘటనలు అద్దం పడుతున్నాయి. అభివృద్ధి, పట్టణీకరణ, సుదరీ కరణ పేరుతో వేగంగా విస్తరిస్తున్న పట్టణా ల్లో సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు, గుట్టలు హరించుకపోయాయి. వాటి ఫలిత మే జిల్లాలో, పట్టణాలు ముంపుబారిన పడుతున్నాయి అనడంలో సందేహం లేదు. అక్ర మ నిర్మాణాలు చేపడుతున్న సమయంలో మిన్నకుంటున్న అధికా రులు.. ఉపద్రవాలు సంభవించినప్నుడు చేతులేత్తెస్తున్నారు. 

హుజుర్‌నగర్‌లోనూ ఆక్రమణలే 

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు చాలా గ్రామాలు వాన నీటితో నిండటంతోపాటు చెరువుల కట్టలు, పలు చోట్ల వంతెనలు తెగిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రజా జీవనం స్తంభించింది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే అని స్పష్టమవుతుంది. హుజూర్‌నగర్ పట్టణంలో మురుగు నీరంతా పోచమ్మ చెరువులోకి చేరుతుంది. అయితే ఈ మురుగు నీరు వెళ్లేందుకు గల కాల్వ గతంలో 12 అడుగుల వెడల్పు ఉండేది. గత ప్రభుత్వం ఈ చెరువును ట్యాంక్‌బండ్‌గా సుందరీకరించే క్రమంలో ఈ కాల్వను ఆక్రమించిన వారిని ఖాళీ చేయించలేక 4 అడుగుల వెడల్పుకి కుదించారు. ఫలితంగా మురుగు నీరు పట్టక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణమంతా జలమయమైంది. ముఖ్యంగా చెరవుకు వెళ్లే కాల్వలో నీరు పట్టక శివాలయం పక్క నుంచి గోవిందపురానికి వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే హుజూర్‌నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువులు తడిసి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. గమనించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏఈని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా బూరుగడ్డలోని నల్లరాచెరువు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇక్కడా సుమారు 50 ఎకరాలకు పైగా ఆక్రమించడంతో పైనుంచి వచ్చే నీరు గోపాలపురం, బూరుగడ్డ మధ్యలో రోడ్డు పైనుంచి వెళ్లడంతో రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇవే కాక చాలా గ్రామాల్లో గల చెరువులు భారీస్థాయిలో అక్రమణలకు గురికావడంతో చెరువుల విస్తీర్ణాలు తగ్గిపోయి చెరువు కట్టలు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో పాటు పంట నష్టం వాటిల్లింది. వీటంతటికి కారణం ఆక్రమణలేనని తెలిసినా అధికారులు కళ్లు తెరవకపోవడం బాధాకరం. 

కోదాడను ముంచిన చెరువుల ఆక్రమణ 

కోదాడ పట్టణంలో రోడ్డుపై ప్రవహించిన వరద కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతిచెందడం చరిత్రలో మరిచిపోలేని ఘటన. ఇందుకు కారణం కోదాడ పట్టణంతోపాటు చుట్టూ ఉన్న చెరువులు కబ్జాలకు గురికావడం, వీటిలో అక్రమ నిర్మాణాలు వెలువడమే అని స్థానికులు ఆరోపిసస్తున్నారు. కోదాడలో పట్టణానికి మధ్యలో 743 ఎకరాలలో పెద్ద చెరువు ఉంది. ఇందులో సుమారు 300 ఎకరాలకు పైగా కబ్జాలు జరిగినట్టు బహిరంగానే చర్చిచుకుంటున్నారు. ఈ చెరువులో వందలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అదేవిధంగా పట్టణానికి ఒక వైపున ఎర్రకుంట చెరువు, మరో పక్క శ్రీరంగాపురంలోని సాకి చెరువులు ఉన్నాయి.

పట్టణంలో వర్షం కురిస్తే వచ్చే నీరు ఎర్రకుంట చెరువుకు చేరి అక్కడి నుంచి పెద్ద చెరువులోకి వస్తాయి. అయితే ఎర్రకుంట కూడా పూర్తిగా ఆక్రమణలకు గురైంది. దీంతో పెద్ద చెరువుకు ప్రవాహం పెరిగింది. అదీ కూడా ఆక్రమణతో కుంచించుకుపోవడంతో నీరంతా పట్టణంలోకి చేరుతోంది. సాకి చెరువుకు నీరు చేరే వరద కాల్వలు కబ్జా జరగడంతో నీరు జాతీయ రహదారిపైకి చేరుతుంది. ఇంత జరిగినా అధిక వర్షాల కారణంగా ప్రమాదం అని చేతులు దులుపుకుంటున్నారే తప్ప తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసిన దాఖాలాలు కనపించట్లేదు. 

సూర్యాపేట.. నాలా కబ్జాతో తంటా 

సూర్యాపేట పట్టణం 15 ఏళ్ల నుంచి నలుమూలల విస్తరిస్తూ వస్తుంది. పట్టణంలో సుమారు 2.50 లక్షల జనాభా ఉంటే 90 వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పట్టణం చుట్టూ ఉన్నా నాలాలు కబ్జాలకు గురయ్యాయి. ముఖ్యంగా మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చెందిన సద్దల చెరువును కలుపుతూ హైటెక్ బస్టాం డ్ సమీపం నుంచి మానసానగర్ మీదుగా గాంధీనగర్ వరకు గతంలో ప్రధాన నాలా ఉండేది. ఇదీ దాదాపు 60 ఫీట్ల వెడల్పుతో ఉండేదని స్థానికులు చెప్తున్నారు. మానసానగర్‌లో నిర్మాణాలు జరిగాక ఇక్కడ కొన్నిచోట్ల నాలా పరిమాణం తగ్గగా మరికొన్ని చోట్ల నామరూపం లేకుండా పోయింది.

దీంతో ప్రతి వానకాలం నాలా పొంగి వర్షపు నీరు ఇండ్లలోకి వస్తోంది. అంతేకాకుండా మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటు సమయంలో సద్దల చెరువును రెండుగా విభజిస్తూ మధ్యలో కట్టను ఏర్పాటు చేశారు. దీంతో చెరువలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి చెరువు అలుగుపారిన సమయం నీటి ప్రవాహం పెరిగి ఆర్‌కే గార్డెన్, తాళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోని నీరు చేరుతోంది. కాగా, నాలా ఆక్రమణలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నా అడ్డుకునే వారు మాత్రం కనబడటం లేదు.