- సైబర్ వలకు చిక్కుతున్న విద్యావంతులు
- కోట్లలో పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
- స్టాక్ మార్కెట్ పేరిట పటాన్‌చెరులో ౨.౫౦ కోట్లు
- తూఫ్రాన్‌లో రూ.15 లక్షలు మోసపోయిన టెకీలు
- భూపాలపల్లిలో ఏఎస్సై పేరిట 90 వేలకు టోకారా
తూప్రాన్/పటాన్‌చెరు, ఆగస్టు ౩: ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా జనం సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకుపోతున్నారు. నిరక్షరాస్యులు మోసపోతున్నారంటే తెలియక అని చెప్పుకోవచ్చు.. కానీ, ఉన్నత విద్యావంతులు కూడా మోసగాళ్ల వలకు సులువుగా చిక్కి విలవిల్లాడటం గమనార్హం. నిత్యం ఏదో ఒక చోట సైబర్‌నేరం జరుగుతున్నట్టు పత్రికలు, న్యూస్‌చానెళ్లలో చూస్తున్నా కొందరు సామాజిక మాధ్యమాల్లో వచ్చే మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై నిండా మునుగుతున్నారు.
మెదక్,సంగారెడ్డి జిల్లాలో శనివారం వెలుగుచూసిన రెండు సైబర్ మోసాలు ఆ కోవలోనివే. రెండు కేసుల్లో కలిపి మోసగాళ్లు దాదాపు రూ.౨.౬౫ కోట్లు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ ప్రవీన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జూన్‌లో ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ ప్రకటన చూశాడు. తమ యాప్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నేరగాళ్లు ఆశజూపారు. వారి మాటలు నమ్మిన బాధితుడు.. ఆ ప్రకటన క్లిక్ చేసి, మోతిలాల్ ఒస్వాల్ స్ట్రాటజీ గ్రూప్‌లో చేరాడు.
నిత్యం వారి సూచనలకు అనుగుణంగా జూన్ 19 నుంచి ఆగస్టు 2 వరకు 22 విడతల్లో రూ.2 కోట్ల 43 లక్షల 25 వేలు పెట్టుబడిగా పెట్టాడు. ఈ క్రమంలోనే సంబంధిత యాప్‌లో సుమారు రూ.6 కోట్ల వరకు లాభాల్లో ఉన్నట్టు చూపించింది. వెంటనే తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసేందుకు ప్రయత్నించగా విఫలం చెందాడు. సంబంధిత యాప్ నిర్వాహకులకు సంప్రదించేందుకు యత్నించగా ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ శుక్రవారం పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ విభాగానికి చెందిన 1930 నంబర్‌కు ఫిర్యాదు చేసి, సైబర్ నేరగాళ్ల అకౌంట్లలోని రూ.28 లక్షలు ఫ్రీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పటాన్‌చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.
తూప్రాన్ వ్యక్తి.. 15 లక్షలు మాయం
మెదక్ జిల్లా తూప్రాన్‌లో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్ వలలో చిక్కి రూ.౧౫ లక్షలు కోల్పోయాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో ట్రేడింగ్ పేరిట వచ్చిన ఓ లింక్‌పై క్లిక్ చేయగా, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ అనే వాట్సాప్ గ్రూపులో గుర్తుతెలియని వ్యక్తులు చేర్చారు. అనంతరం ఐఐఎఫ్‌ఎల్ ప్రో అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న బాధితుడు.. పలు దఫాలుగా రూ.15 లక్షల వరకు చెల్లించాడు. గత నెల 5న తన ఐడీబీఐ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యాయి.
దీంతో సైబర్ నేరగాళ్లు మళ్లీ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచించడంతో వారి మాటలు నమ్మి దాదాపు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఐఐఎఫ్‌ఎల్ ప్రో యాప్‌లో తనకు రూ.95 లక్షలు చూపించడంతో డ్రాచేసుకునేందుకు ప్రయత్నించగా డబ్బులు రాలేదు. దీంతో రూ.4 లక్షలు చెల్లిస్తేనే మిగతా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని సదరు సంస్థ కస్టర్ కేర్ నంబర్ ద్వారా తెలియజేయడంతో తాను మోసపోయానని తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- అసలుకు నాలుగు రెట్ల నకిలీ నోట్లు
- 1౦ లక్షలు దండుకున్న ముఠా
- మెట్‌పల్లి పోలీసుల అదుపులో సభ్యులు
జగిత్యాల, ఆగస్టు 3 (విజయక్రాంతి): అసలుకు నాలుగురెట్లు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీసులు అరెస్టుచేశారు. జగిత్యాలకు చెందిన సదల సంజీవ్, బిట్టు శివకుమార్, మగ్గిడి కిషన్, కలకుంట్ల గంగారం, బొంగురాల మల్లయ్య, మాణిక్య అశోక్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ఒరిజినల్ నోట్లకు పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించేవారు. వాళ్ల మాటలు నమ్మినవారిని తాము చెప్పిన చోటకు రప్పించుకునేవారు. ముందుగా వారి నుంచి అసలు నోట్లు తీసుకొని, నకిలీ నోట్లు ఇస్తున్న సమయంలో.. ముఠాలోని మిగిలిన సభ్యులు పోలీసులు వస్తున్నారంటూ అరిచి, భయభ్రాంతులకు గురిచేస్తారు.
నకిలీ నోట్ల కోసం వెళ్లిన వారు పారిపోయేలా చేస్తారు. ఇలా గత ఏడాది కాలంగా పలువురని మోసం చేశారు. హైదరాబాద్‌లో ముగ్గురు, కరీంనగర్, జగిత్యాల, ధర్మపురిలలో ఒక్కొక్కరిని ఇలా నమ్మించి దాదాపు రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ నెల 1న మెట్‌పల్లి శివారు పెద్దగుండు వద్ద రాజేందర్ అనే వ్యక్తి నుంచి రూ.లక్ష తీసుకుని మోసం చేశారు. అతడి ఫిర్యాదు మేరకు శుక్రవారం నిందితులను మెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.ఏడు లక్షల విలువైన రూ.500 నకిలీ నోట్లు, ఆరు సెల్‌ఫోన్లు, బైక్ సాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఉమామహేశరరావు తెలిపారు.
ఏఎస్సై పేరుతో రూ.90 వేలు టోకరా
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు ౩ (విజయక్రాంతి): సైబర్ నేరాల నియంత్రణకు ఓ వైపు పోలీసులు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుంటే మరో వైపు అదే పోలీసుల పేరుతో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌లోని మీసేవా కేంద్ర నిర్వాహకుడు చీర్ల తిరుపతికి మహాదేవ్‌పూర్ ఠాణా నుంచి ఏఎస్సైని మాట్లాడున్నా అని ఓ సబర్ నేరగాడు ఫోన్‌చేశాడు. కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉందని, హోంగార్డుతో రూ.90 వేలు పంపిస్తున్నానని చెప్పాడు.
తన ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు జమచేయాలని కోరాడు. అతని మాటలు నమ్మి తిరుపతి ఖాతాకు డబ్బులు జమ చేశాడు. అయితే, డబ్బులు పంపిస్తానన్న హోంగార్డు ఎంత సేపటికి రాకపోవడంతో తిరుపతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు. అయితే, అసలు ఠాణాలో ఏఎస్సై లేరని, ఆ ఫోన్ ఎవరు చేశారో? మీరు ఎవరికి డబ్బులు పంపించారో? అని పోలీసులు చెప్పడంతో తిరుపతి ఖంగుతిన్నాడు. దానిపై ఆరా తీయగా ఏఎస్సై పేరుతో సైబర్ నేరగాడు ఎర వేసినట్టు గుర్తించారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే సైబర్ క్రైమ్‌కు సమాచారం అందించారు. దీనిపై విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేయనున్నట్టు ఎస్సై పవన్ తెలిపారు.