calender_icon.png 21 September, 2024 | 5:40 AM

హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ

21-09-2024 02:07:55 AM

విస్తృత అధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం 

  1. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
  2. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ పేర్లు
  3. వచ్చే ఖరీఫ్ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్ 
  4. ట్రిపుల్‌ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై కమిటీ 
  5. కొత్త మెడికల్ కాలేజీలకు 3 వేల మంది సిబ్బంది 
  6. క్యాబినెట్ ఆమోదం.. 
  7. 3 గంటలపాటు సమావేశం
  8. స్‌ఎల్బీసీ పూర్తికి ౪,౬౩౭ కోట్ల రివైజ్డ్ ఎస్టిమేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించింది. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్ష తన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు ౩ గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. 

మూడు యూని వర్సిటీల పేర్ల మార్పుతో పాటు సన్న వడ్లకు ఈ ఖరీఫ్ నుంచే మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, నార్కెట్‌పల్లి, మునుగోడు ప్రాంతాల్లోని దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగునీరు అందించే శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ)ను మూడేళ్లలో పూర్తి చేయాలని, అందుకు రూ.4,637 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

క్యాబినెట్ సమావేశ నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడి యాకు వివరించారు. హైడ్రాకు విస్తృత అధికారాలతో చట్టబద్ధత కల్పించేందుకు సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. ఈ విభాగం కోసం 169 మంది సిబ్బందిని, వివిధ శాఖల నుంచి 946  మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి పర్యావరణాన్ని హైడ్రా కాపాడుతుందని చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీల్లోనూ హైడ్రా పని చేస్తోందని తెలిపారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఖరారు చేసేందుకు ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈఎన్‌సీతోపాటు 12 మంది అధికారులతో ఒక కమిటీని వేయాలని నిర్ణయించామని, ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ, సభ్యులుగా నేషనల్ హైవే, జియాలజీ శాఖతో పాటు జిల్లాల కలెక్టర్లు ఉంటారని పొంగులేటి వివరించారు. 

సిబ్బంది నియామకానికి అనుమతి 

పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ను ఎస్‌పీఎల్ కింద ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు పొంగులేటి వెల్లడించారు. ‘తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్‌కు కార్పొరేషన్‌కు సంబంధించి మనోహరాబాద్ మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుకు 72 ఎకరాల భూమిని, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో  ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 58 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి బదిలి చేయాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కాలేజీలకు టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి 3 వేల మంది సిబ్బందిని నియమించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కోస్గిలో ఇంజినీరింగ్, హకీంపేటలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది’ అని మంత్రి వెల్లడించారు. 

మూడు వర్సిటీలకు పేర్లు మార్పు 

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతోపాటు ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్లూమ్ టెక్నాలజీకి పెట్టాలని మంత్రివర్గం తీర్మానించిందని పొంగులేటి వెల్లడించారు. అలాగే తెలుగు యూనివర్సిటికి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు, మహిళా యూనివర్సిటికి చాకలి ఐలమ్మ పేర్లు పెట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 60 మంది విద్యార్థులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి సమధానమిచ్చారు. 

మూడేండ్లలో ఎస్‌ఎల్‌బీసీ: మంత్రి ఉత్తమ్ 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 20 ఏళ్లుగా రైతులు, గిరిజన ప్రజలు ఎస్‌ఎల్‌బీసీ కోసం ఎదురు చూస్తున్నారని, వారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నేరవేర్చబోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  మొదటి నుంచి పోరాటం చేయడంతో పాటు ఆ ప్రాజెక్టును మంజూరు చేయించడంలో ఎంతో  కష్టపడ్డారని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసేందుకు రూ.4,637 రివైజ్ ఎస్టిమేషన్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రెండుమూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

ప్రతి నెల 400 మీటర్ల టన్నెల్ వర్క్ చేయాలని లక్ష్యంగా పెట్టుకన్నట్లు చెప్పారు. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతి రోజు 4 వేల క్యూసెక్కులు, ఏడాదికి 30 టీఎంసీల నీటిని తీసుకొని నల్లగొండ, మునుగోడు, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో  దాదాపు 4 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు గుర్తుచేశారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను కూడా ప్రారంభిస్తామని, ఇరిగేషన్ మంత్రిగా తన హయాంలో పూర్తి కావడం తనకు చాలా సంతృప్తిగా ఉందని చెప్పారు.

డిండి రిజర్వాయర్‌కు పర్యావరణం అనుమతి, మిగిలిన 5 శాతం పనులు వేగవంతం చేయడానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాల ఆయకట్టు రాలేదని, ఎస్‌ఎల్‌బీసీకి రూ.4 వేల కోట్లతో 4 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ పంట నుంచే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో వరి పంట వస్తుందని అంచనాతో ఉన్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని,  జనవరి నెల నుంచి అన్ని రేషన్‌కార్డులకు నూటికి నూరు శాతం సన్న బియ్యం ఇవ్వబోతున్నామని వెల్లడించారు.  

ఎస్‌ఎల్‌బీసీని కేసీఆర్ పట్టించుకోలేదు: కోమటిరెడ్డి 

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.4,637 కోట్లు కేటాయించారని, అందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారం ఎంతో ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టుతో జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు గ్రావిటీ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.

ఎస్‌ఎల్‌బీసీ ముందుకు పోదు.. వెనక్కి పోదని కేసీఆర్ నిండు అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. జిల్లాలో ఫ్లోరైర్ రహిత నీటిని అందించేందుకు గత ప్రభుత్వం మిషన్ భగీరథ పనుల్లో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందని, అందులో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుం దనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జాప్యం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నింటినీ అమలు చేస్తున్నామని, తమ ప్రభుత్వం మాటల సర్కార్ కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు.