calender_icon.png 1 November, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పూర్తిస్థాయి డిజిటల్ క్లాసులు!

01-07-2024 12:10:00 AM

1 నుంచి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధన

749 గంటల కంటెంట్ సిద్ధం చేసిన అధికారులు

ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారం

తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో పాఠ్యాంశాలు

హైదరాబాద్, జూన్ 30(విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి డిజిటల్ పాఠాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టీశాట్  సౌజన్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు నేటి నుంచి పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు  టీశాట్  షెడ్యూల్  సైతం ఖరారు చేసింది. ఈ విషయాన్ని  ఆదివారం టీశాట్  సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. 

విద్యా శాఖ క్యాలెండర్‌ను అనుసరించి పాఠ్యాంశాల ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి గత పది రోజులుగా బ్రిడ్జ్ కోర్స్ పాఠ్యాంశాలను టీశాట్  ప్రసారం చేస్తోంది. జులై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రసారం చేసేందుకు 749 గంటల కంటెంట్ సిద్ధం చేసింది. 223 పాఠశాలల పని రోజుల్లో ప్రసారం చేసేందుకు ఈ కంటెంట్‌ను 1,498 పాఠ్యాంశ భాగాలుగా విభజించింది. పాఠశాలల పని రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టీశాట్ విద్యాఛానల్‌లో విద్యార్థులకు అనుగుణంగా పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. పాఠశాలల్లో  ప్రత్యక్షంగా పాఠాలు వినలేని విద్యార్థులు ఆన్‌లైన్ వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని సీఈవో సూచించారు.

ప్రాథమిక విద్యకు సంబందించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్యాంశాలను టీశాట్ ప్రసారం చేయనుంది. డిజిటల్ పాఠాలు తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు ఉర్దూ భాషలోనూ అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 29,478 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 58,98,685 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ టీశాట్  డిజిటల్ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ పిలుపునిచ్చారు. డిజిటల్ పాఠాల కంటెంట్  టీశాట్  శాటిలైట్ ఛానెల్ విద్యతో పాటు యాప్, యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి.