* పతంగులపై రాజకీయ నాయకుల ఫొటోలు, నినాదాలు
* ప్రధాని మోదీ ఫొటోతో కూడిన గాలిపటాలపై గుజరాత్ ప్రజల ఆసక్తి
గాంధీనగర్, జనవరి 9: మకర సంక్రాతి అంటే సాధారణంగా గుర్తొచ్చేది పతంగులు. చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలను ఎగరేస్తూ సంబర పడుతుంటారు. ప్రజల ఆసక్తులను ప్రకారం రకరకాల పతంగులను వ్యాపారులు మార్కెట్‌లోకి తీసుకొస్తుంటారు.
ఈ క్రమంలోనే గుజరాత్ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీకి ఫొటోతో కూడిన గాలిపటాలను అక్కడి వ్యాపారులు ప్రజలకు అందుబా టులోకి తెచ్చారు. దీంతో వాటి పట్ల అక్కడి ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. పోటీ పడి మరీ ప్రధాని మోదీ ఫొటో, ప్రధాని ఇచ్చిన బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛతా అభియాన్ వంటి నినాదాలు ముద్రించి ఉన్న గాలిపటాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.
వీటితో పాటు ఆమ్‌ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ ఫొటోతో కూడిన గాలిపటాలు కూడా అందుబాటు ఉన్నప్పటికీ వాటిని ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదట. దీని ద్వా రా ప్రధాని మోదీపై గుజరాత్ ప్రజలు పెంచుకున్న అభిమానం బయటపడుతుందని కొం దరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
50వేల చర్కీలు విక్రయించాం
‘గతంతో పోల్చితే ఈ ఏడాది గాలిపటాల కొనుగోళ్లు బాగానే జరుగుతున్నాయి. శని, ఆదివారాల్లో కొనుగోళ్లు మరింత పెరగొచ్చు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటోతో కూడిన గాలిపటాలకు, చర్కీలకు ఎక్కువ డిమాండ్ ఉంది’ అని స్థానిక వ్యాపారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
మరో దుకాణదారుడు మాట్లాడుతూ ఇప్పటి వరకూ తాను ప్రధాని మోదీ ఫొటోతో కూడిన 50వేల చర్కీలను విక్రయించినట్టు పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఫొటోతో కూడిన చర్కీలు కూడా ఉన్నప్పటికీ వాటిని కొనడానికి ప్రజలు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు’ అన్నారు.