calender_icon.png 2 January, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరస్పర బదిలీలకు ఫుల్ డిమాండ్

31-12-2024 01:42:41 AM

* 317 జీవో బదిలీలకు సిద్దిపేటలో గిరాకీ 

* మ్యూచ్‌వల్‌కు లక్షల్లో డిమాండ్

*  సాధారణ బదిలీలకు కష్టమే

*  నేడే దరఖాస్తుకు చివరి తేదీ

సిద్దిపేట, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దాంతో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చింది. దాంతో సీనియర్ ఉద్యోగులు అనుకున్న చోటే ఉండిపోగా, జూనియర్లకు సొంత జిల్లా కాకుండా ఇతర(ఉమ్మడి) జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ప్రతిప  ఉన్న కాంగ్రెస్ 317 జీవోను తప్పుపట్టింది. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీవోను సవరించి ఉపాధ్యాయ, ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక 317జీవో బాధిత ఉద్యోగుల బదిలీలకు స్వీకారం చుట్టింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం దరఖాస్తుకు డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది.

స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలు కావడంతో ఉపాధ్యాయ, ఉద్యోగుల మధ్య బేరం మొదలైంది. ఉపాధ్యాయ పోస్టులకు అధిక డిమాండ్ కొనసాగుతోంది. సిద్దిపేట పట్టణానికి దగ్గరలో ఉన్న టీచర్ పోస్టులకు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు డిమాండ్ పలుకుతోంది.

మరికొద్ది కాలంలో పదవీ విరమణ పొందేవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసం అధికంగా డబ్బులు వస్తాయనే ఆశతో కొంతమంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉపాధ్యాయులు మెదక్ ఇతర ప్రాతాలకు వెళ్లడానికి మ్యూచువల్‌కు తకమిట్‌మెంట్ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు అడిగిన డబ్బుపెట్టి బదిలీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

జిల్లాలో 500 మంది..

317 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు వెళ్లిన సాధారణ ఉపాధ్యాయులు ఎటూ తేల్చుకొని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పౌజ్, మెడికల్, మ్యూచువల్‌కు మాత్రమే అవకాశం కల్పించడంతో ఇతర ప్రాంతానికి వెళ్లిన జూనియర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఇతర జిల్లాకు వెళ్లిన వారు 500కు పైగా ఉన్నారు.

సుమారు 50 మంది మెడికల్, 200 మంది స్పౌజ్ బదిలీలకు అర్హులున్నట్లు సమాచారం. స్థానికత ఆధారంగా బదిలీ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

సన్నిహితుల సమక్షంలో ఒప్పందాలు 

317 జీవో బదిలీలకు సిద్దిపేట జిల్లా అత్యంత కీలకంగా మారింది. ఈ జిల్లాకు చెందినవారు అధిక సంఖ్యలో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. అయితే ఇతర ప్రాంతానికి వెళ్లినవారు సిద్దిపేటకు రావడానికి మొగ్గుచూపుతున్నారు. అందుకే సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్న ఇతర ప్రాంత ఉపాధ్యాయులకు, పదవీవిరమణ దగ్గర్లో ఉన్నవారు బదిలీకి మ్యూచువల్ ఇస్తున్నారు.

ఇద్దరి మధ్య సన్నిహితులైన ఉపాధ్యాయ మిత్రుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మరికొందరైతే బాండ్ పేపర్లు రాసుకుంటున్నారు. ఇద్దరి పేరుతో జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసి అందులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు.