రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌పై దాదాపు స్పష్టత
31తో ముగుస్తున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్
కేంద్ర బడ్జెట్ తేదీలు తేలటంతో రాష్ట్రంలో కదలిక
కేంద్రం నుంచి వచ్చే నిధులతో కొత్త అంచనాలు
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభత్వం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని ప్రకటించటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌పై ఒక నిర్ణయానికి వచ్చిన ట్టు తెలిసింది. ఈ నెల ౨౯వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న ట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బడ్జె ట్ తర్వాతే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. దీంతో కేంద్ర పద్దును ప్రకటించిన వారం రోజుల్లో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కారు ఫిబ్రవరిలో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
కేంద్రం ఇచ్చే నిధులు లెక్కేసుకొని..
రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుం చి నిధులు రావాల్సి ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్, ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన నిర్ణయాలను బడ్జెట్‌లో కేంద్ర ప్రకటించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, మూసీ పునరుద్ధరణ, ఇతర కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాయాన్ని కోరుతోంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయలను కూడా ఆశిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అంచనాలను బట్టి.. రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అవకాశం ఉన్నది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌పై క్లారిటీ రావటంతో ఈ నెల 27 లేదా 29 తేదీల్లో రేవంత్ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈ రెండు తేదీల్లో కుదరకపోతే.. 31న కచ్చితంగా రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను మంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
అంచనాలు సిద్ధం.. సవరింపులే తరువాయి
రేవంత్‌రెడ్డి సర్కారు ఫిబ్రవరిలో పూర్తిస్థాయి కసరత్తుతో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇందులో కొన్ని కేటాయింపులను సవరించడం ద్వారా పూర్తిస్థాయి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. అందుకే కేటాయింపులను మార్చేందుకు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ల వారీగా ఆర్థిక శాఖ అంచనాలను సేకరించింది. నిర్వహణ పద్దులో ఎలాంటి మార్పులు చేయకుండా.. సంక్షేమం, మానవ వనరులన కల్పన, వ్యవసాయం, ఉపాధి రంగాలకు కేటాంయిపులను పెంచాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. శాఖలవారీగా వచ్చిన డాటా ఆధారంగా ఇప్పటికే ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసిన ఆర్థిక శాఖ.. కేంద్ర బడ్జెట్ ప్రకటించిన రెండుమూడు రోజుల్లో అంచనాలను సంపూర్ణంగా సవరించనుంది. అనంతరం పూర్తిస్థాయి పద్దును రూపొందించనుంది. ఆరు గ్యారెంటీలకు కేటాయింపుల పెంపు
ఫుల్ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో లబ్ధిదారులను ప్రాధమికంగా అంచనా వేసి.. ఆరు గ్యారెంటీలకు రూ.53,196 కోట్లు కేటాయించారు. ఈ నిధులు ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన 13 హామీలకు సరిపోయేలా కనిపించడం లేదు. ముఖ్యంగా రుణమాఫీకి నిధులు భారీగా కావాల్సి ఉంది. అందుకే ఈ బడ్జెట్‌లో గ్యారెంటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ.53,196 కోట్లకు మరో 40 శాతం నిధులను కలపనున్నట్లు సమాచారం.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో
కీలక కేటాయింపులు (రూ. కోట్లలో)
మొత్తం బడ్జెట్ 2,75,891
ఆరు గ్యారెంటీలు 53,196
పంచాయతీ రాజ్ శాఖ 40,080
నీటిపారుదల శాఖ 28,024
విద్యారంగం 21,389
వ్యవసాయ శాఖ 19,746
పురపాలక శాఖ 11,692
వైద్య రంగం 11, 500
గృహ నిర్మాణం 7,740
మూసీ ప్రాజెక్టు 1000
ఎస్సీ సంక్షేమం 21,874
ఎస్టీ సంక్షేమం 13,013
బీసీ సంక్షేమం 8,౦౦౦
మైనార్టీ సంక్షేమం 2,262
రైతు రుణమాఫీ 10,000