02-04-2025 12:00:00 AM
భద్రాద్రికొత్తగూడెం, ఏప్రిల్ 1, (విజయక్రాంతి): సంస్థ అభివృధ్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల సొంతింటి కల నెరవేర్చేవిదంగా చర్యలు చేపట్టాలని, సంస్థకు సేవ చేసి పదవి విరమణ పొందిన కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను పూర్తిస్థాయిలో కేటాయించి గృహవసతి కల్పించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, గుర్తింపు సంఘం గౌరవ అధ్య క్షులు కూనంనేని సాంబశివరావు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాంను కోరారు.
సంస్థ ప్రధాల కార్యాల యంలో మంగళవారం సిఏండితో సమావేశమై కార్మికులు, మాజీ కార్మిక కుటుంబాలు, కోల్ బెల్ట్ ప్రాంతాల సంబందించిన పలు అంశాలను అయన దృష్టికి తీసుకెళ్లారు. తన ప్రతిపాదనలను లేఖల రూపంలో అధికారికి అందించారు.
మూ డుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ సంస్థలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులకు నిలువ నీడలేని పరిస్థితులు నెలకొంటున్నాయని, కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్మికులు పదవి విరమణ పొందిన అనంతరం వారు నివసిస్తున్న క్వార్టర్లను వారికి కేటాయించి యాజమాన్య హక్కు కల్పించాలని కోరారు.
పోస్టాఫీసు సెంటర్ నుంచి హేమచంద్రాపురం ఉన్న రోడ్డు బొగ్గు లారీల రాకపోకల వాళ్ళ పూర్తిగా శిధిలమైందని, తరచు ప్రమాదాలు చోటుచుకుంటున్నందున ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించి, డివైడర్తోపాటు సెంట్ర ల్ లైటింగ్ ఏర్పాటు చేయాలనీ, బస్టాండు సెంటర్ నుంచి త్రిమాత టెంపుల్ వరకు ఉన్న రోడ్డును కూడా విస్తరించి డివైడర్లు ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
కొత్తగూడెం ప్రాంతంలో 17 కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకు ప్రతిపాదించామని అందుకు కావాల్సిన స్థలాలని యాజమాన్యం కేటాయించాలని, కొత్తగూడెం, రామ వరం ప్రాంతాల్లో వున్నా కమ్యూనిటీ హాళ్లను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనీ కోరారు. ఎంజి రోడ్డులోని సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్సును ఆధునిక పద్దతిలో నిర్మాణం చేయాలనీ, ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా సంస్థ ఆధ్వర్యంలో మల్టిఫ్లెక్సు నిర్మాణం చేపట్టాలని కోరారు.
త్వరలో ప్రారంభం కానున్న వికె ఉపరితల గని నిర్వహణను సంగరేణి యాజమాన్యమే చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని, ప్రేవేటు సంస్థలకు అప్పగిస్తే అడ్డుకుంటామని సిఏండికి తెలిపామన్నారు. తమ ప్రతిపాదనలపై సిఏండి సా నుకూలంగా స్పందించారని, త్వరలో వీటి అమలుకు యాజమాన్యం చర్యలు చేపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజ్ కుమార్, నాయకులు కె సారయ్య, వట్టికొండ మల్లికార్జున్ రావు, ఎస్ వి రమణమూర్తి, సందెబోయిన శ్రీనివాస్, సింగరేణి డైరెక్టర్ (పా) వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్లు రాధాకృష్ణ, రాజేశ్వర్ రావు, సూర్యనారాయణ తదితరులు వున్నారు.