calender_icon.png 3 October, 2024 | 3:57 AM

ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ

03-10-2024 01:58:52 AM

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావాలి

తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్ గా మారుస్తాం

జపాన్ తరహా తెలంగాణలో రవాణా వ్యవస్థ అభివృద్ధి

తోషిబా కార్యలయ సందర్శనలో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని అధికంగా వినియోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ యూనిట్‌లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని జపాన్ పారిశ్రామిక వేత్తలను కోరారు.

జపాన్ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి బుధవారం తోషిబా ప్రధాన కార్యాలయం, ఇతర పరిశ్రమలను సందర్శించారు. ఫ్యూయల్ సెల్ విభాగాల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్దఎత్తున సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

రాష్ర్టంలోని ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దాలని భావిస్తున్నామని, దీనికి తోషిబా సేవలు అవసరమవుతాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాలను చేపట్టనుందని వెల్లడించారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబాతో సింగరేణి కలిసి పనిచేసే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.

తెలంగాణలో తోషిబాను విస్తరిస్తాం: కంపెనీ ప్రతినిధులు

తోషిబా ప్రధాన కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం భట్టి సందర్శించగా.. కంపెనీ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తుల సేవలను వారు వివరించారు.

తోషిబా ఫ్యూయల్ సెల్ తయారీ యూనిట్‌ను భట్టి సందర్శించారు. తెలంగాణలో సంస్థను విస్తరించాలని భట్టి కోరగా.. కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో మాత్రమే తమ యూనిట్లను ఉన్నాయని తోషిబా ప్రతినిధులు భట్టికి వివరించారు. అందులో తెలంగాణ ప్రముఖమైందన్నారు.

ఈవీ వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని, ప్లాంట్ విస్తరణకు ప్రయత్నిస్తామని తోషిబా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అనంతరం ఒసాకాలో ఉన్న ఎలక్ట్రానిక్ కంపెనీ పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు.

ప్రజా రవాణాలో జపాన్ ఆదర్శం: భట్టి

ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. తోషిబా అధికారులతో సమావేశం అనంతరం బుధవారం టోక్యో నుంచి బుల్లెట్ ట్రైన్‌లో ఒసాకాకు వెళ్లారు. 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 20 నిమిషాల్లో బుల్లెట్ ట్రైన్ ద్వారా చేరుకున్నారు.

ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని, ట్రైన్‌లో సౌకర్యాలు ఎంతో బాగున్నాయని భట్టి చెప్పారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట రాష్ర్ట ఆర్థిక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, భారత రాయబార కార్యాలయ అధికారులు బన్సల్, దేవజానీ ఉన్నారు.