calender_icon.png 12 December, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చల్లారిన మంచు సెగలు

12-12-2024 01:39:42 AM

  1. పోలీసుల జోక్యంతో అంతా గప్‌చుప్
  2. ఇంకా ఆసుపత్రిలోనే మోహన్‌బాబు
  3. రాచకొండ సీపీ ముందు హాజరైన విష్ణు, మనోజ్ 
  4. గొడవలకు వెళ్లనని సీపీకి మనోజ్ రూ. లక్ష బాండ్ పేపర్ పూచీకత్తు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి)/మహేశ్వరం: సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవ రాచకొండ సీపీ సుధీర్‌బాబు జోక్యంతో కాస్తా చల్లారినట్టు కనిపిస్తోంది. బుధవారం ఉద యం 10:30 గంటలకు తన కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మంచు మోహన్‌బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌లకు  రాచకొండ సీపీ అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేయడం..

అనంతరం మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ సుధీర్‌బాబు కార్యాలయంలో మంచు విష్ణు, మనోజ్‌లు వేర్వేరుగా హాజరై తమ వాదనలు వినిపించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్‌బాబు పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణకు మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను  ఈ నెల 24కి వాయిదా వేసింది. 

మా నాన్న దేవుడు: మంచు మనోజ్ 

బుధవారం ఉదయం రాచకొండ కమిషరేట్ కార్యాలయానికి విచారణ కోసం వెళ్లడా నికి జల్‌పల్లి ఇంట్లో నుంచి మంచు మనోజ్ ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ సమయంలో జర్నలిస్టులు మోహన్‌బాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మనోజ్ మీడియా పాయింట్ వద్దకు వచ్చి మాట్లాడారు. జర్నలిస్టులకు పూర్తి మద్దతు తెలిపారు. మీకు ఏ కష్టం వచ్చినా నాకు నేరుగా లేదా ఫోన్‌లో మాట్లాడినా సహకరిస్తానన్నారు.

ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నారు. మీడియా మిత్రులపై జరిగిన దాడిలో మా  నాన్న తరఫున నేను క్షమాపణ చెప్తున్నానని అన్నారు. నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా ఉందన్నారు. నేను ఏనాడు ఇంట్లో డబ్బు కానీ, ఆస్తి కానీ అడగలేదన్నారు. నా కాళ్లపై నేను నిలబడ్డాను అని పేర్కొన్నారు. మా నాన్న దేవుడు.. ఇలా ఉండేవారు కాదన్నారు.

ఈ నాన్న మా నాన్న కాదన్నారు. వివాదంలోకి తన భార్యతోపాటు ఏడు నెలల కూతురిని కూడా లాగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడానికి పోరాడానని, దాంట్లో తప్పేముందన్నారు. చంద్రగిరిలో అందరూ తెలిసిన వారే, బంధువులు ఉన్నారని, విద్యాలయంలో అవకతవకలు జరిగాయని తన దృష్టికి వస్తే వాటిని పరిష్కరించమని చెబితే తనను శత్రువుగా చూస్తున్నారన్నారు.

వ్యాపారంలో చాలా విషయాల్లో అవకతవకలు జరుగుతున్న విషయం సరిగ్గా నాన్నకు తెలియదన్నారు. ‘మా అన్న విష్ణును వినయ్ ట్రాఫ్ చేశారు. నాన్న దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నారు. నాకు అండగా నిలిచిన అమ్మను కూడా దూరం చేస్తున్నారు. మా ఇంట్లో వాళ్లు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం చేశాను.

ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. మా అన్న కంపెనీలో పనిచేశాను. పాటలతో పాటు రికార్డింగ్‌లు, ఫైటర్‌గా, డైరెక్టర్‌గా కూడా చేశానన్నారు. అయిన ఏనాడు ఒక్క పైసా ఆశించ లేదు’ అంటూ కంటతడి పెట్టారు. ‘ఇంట్లో ఎన్ని జరిగిన మౌనంగా ఉన్నాను. ఈ రోజు ప్రశ్నిస్తే శత్రువుగా కనిపిస్తున్నాను.

ఈ రోజు నా భార్య, పిల్లల కోసం నిలబడకపోతే రేపు పెద్దయ్యాక నా కొడుకు, కూతురుకు ఏం సమాధానం చెప్పాలి. నేడు వేరే వాళ్ళ కడుపు కొట్టి పిల్లల మొహం చూడలేను. ఆ కూడు నా పిల్లలకు పెట్టలేను. మా నాన్న, అమ్మ అలా నన్ను పెంచలేదు. మా అమ్మ ఆసుపత్రిలో చేరలేదు. డాక్టర్లకు చూపించుకొని మా అన్న ఇంటికి వెళ్లిపోయింది.

నా భార్యకు అమ్మ అయినా.. నాన్న అయినా నేనే. తను కూడా తన కాళ్లుపై నిలబడి వ్యాపారం చేసుకుంటున్నది. మా స్నేహితుల సహాయంతో కొంత డబ్బు అప్పు చేసి లాక్‌డౌన్ సమయంలో పెట్టుబడులు పెట్టి  బొమ్మల తయారు కంపెనీ పెట్టుకున్నాం. మా నాన్న భుజాల మీద గన్ను పెట్టి నన్ను కాల్చే ప్రయత్నం చేస్తున్నారు’.

వినయ్‌కి, మా అన్నకి సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి మొత్తం వివరాలు అందిస్తాను అన్నారు. ముందుగా ఇంట్లో సీసీ కెమెరాలు మాయం చేసిన దొంగలను పట్టుకుంటే అన్ని విషయా లు బయటకు వస్తాయని మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు బయలుదేరారు.

అయి తే సాయంత్రం కమిషనరేట్ నుంచి తిరిగి వచ్చిన మనోజ్ నేరుగా జల్‌పల్లి ఇంట్లోకి వెళ్లిపోయారు. జల్‌పల్లి ఇంట్లో భార్య మౌనిక, పిల్లలతో పాటు మనోజ్ మాత్రమే ఉన్నారు. 

సీపీ ముందు హాజరైన మంచు మనోజ్..

గత ఐదు రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యం లో పోలీసులు ఇచ్చిన నోటీసులతో మనోజ్ బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషనర్ సుధీర్‌బాబు ఆయనను గంటన్నరపాటు ప్రశ్నించి వివరణ తీసుకున్నాడు.

ఆస్తుల గొడవలు ఉంటే కుటుంబంలో పరిష్కరించుకోవా లని, బయటకొచ్చి ఘర్షణలకు దిగితే సీరియస్ యాక్షన్ తప్పదని మనోజ్‌ను సీపీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని చెప్పినట్లు సమాచారం. దీంతో తనంతట తాను గొడవలకు దిగనని, తన తరపున ఎలాంటి గొడవ జరగదని సీపీకి రూ. లక్ష బాండ్ పేపర్‌ను మనోజ్ రాసిచ్చారు.

అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడు తూ.. కుటుంబంలో తలెత్తిన సమస్యను కూ ర్చుని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని చెప్పారు. వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నారని.. ఇదంతా తన తండ్రికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. తన అమ్మ ఆ సుపత్రిలో అడ్మిట్ అయ్యారనేది అవాస్తవమ న్నారు. అన్న విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని మనోజ్ పేర్కొన్నారు. 

మోహన్‌బాబుకు బీపీ.. 

మోహన్‌బాబు మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆసుపత్రి బృందం ఒక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒళ్లు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని పేర్కొంది.

వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించమన్నారు. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని కాంటినెంటల్ ఆసుపత్రి చైర్మన్ గురు ఎన్ రెడ్డి వివరించారు. 

మమ్మల్ని అమితంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు: మంచు విష్ణు

గొడవలపై మొదటిసారిగా విష్ణు స్పందించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు.

ప్రతీ కుటుంబంలో నూ ఇలాంటి గొడవలు  ఉంటాయి. కాబట్టి, ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకెళ్లడం కరెక్టే కానీ, కొంతమంది హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. మా అమ్మ కూడా ఆసుపత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి.

కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్‌ఏంజెల్స్ లో ఉన్నప్పుడు మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వెంటనే వచ్చేశాను. అన్నింటికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్‌కు వచ్చా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊర్లో లేని ౪ రోజు ల్లో ఇదంతా జరిగిపోయింది. 

మంగళవారం జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకం గా మేము ఎవరినీ బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకు వచ్చారు. ముఖంపై మైక్ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్‌లో మాట్లాడా.. అవసరమైన సాయం చేస్తా’ అని విష్ణు తెలిపారు.

మా కుటుంబంలో బయటివ్యక్తుల ప్రమేయం ఉంటే.. వారికి సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నాను. వారంతట వారే తప్పుకుంటే మంచిది. లేదంటే.. అందరి పేర్లు నేనే బయటపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చేస్తాను. కానీ నా తమ్ముడిపై నేనెప్పుడు దాడి చేయను.

నా సినిమా, మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను. కానీ, నాకు కనుక అవకాశం ఉంటే ఫిర్యాదులు, వాయిస్ మేసేజ్ కూడా బయటకి వచ్చేది కాదు. సమయమే అన్ని సమస్యలకు సమాధానం ఇస్తుం ది ’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

రాచకొండ సీపీ ముందు విష్ణు 

బుధవారం సాయంత్రం రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు విష్ణు హాజరయ్యారు.  తన వాదన వినిపించిన విష్ణు తనకు కోర్టు 24 వరకు గడువు ఇచ్చినట్టు తెలియజేశారు. ఇకపై ఎలాంటి సమస్యలు సృష్టించవద్ద ని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని సీపీ సూచించారు. నిబంధలనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

‘శాంతి’ అంటూ మంచు లక్ష్మి పోస్ట్

ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో సోమవా రం హైదరాబాద్‌కు వచ్చి తిరిగి ముంబై కి వెళ్లిపోయిన మంచు లక్ష్మి తాజాగా  బుధవారం ఇన్ స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియో షేర్ చేసిన ఆమె ‘శాంతి’ అని క్యాప్షన్ పెట్టారు. 

మనోజ్‌పై దాడి కేసులో ఒకరు అరెస్ట్..

జల్‌పల్లి ఫామ్‌హౌస్‌లో ఈ నెల 7న రాత్రి తన తండ్రి మోహన్‌బాబుతో తీవ్ర వాగ్వాదం జరిగే సమయంలో పదిమంది వ్యక్తులు తనపై దాడి చేశారని మనోజ్ ఈ నెల 8న సాయం త్రం పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దాడి అనంతరం సీసీ పుటేజ్ మాయం అయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మంచు విష్ణు అనుచరుడు కందుల వెంకట్ కిరణ్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయ్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మోహన్‌బాబుపై కేసు

సినీ నటుడు మోహన్‌బాబు దాడిలో గాయపడ్డ రిపోర్టర్  రంజిత్ ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు బుధవారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

పోలీసుల నోటీసులపై హైకోర్టు స్టే

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కేసుల విచారణలో భాగంగా హాజరుకావాలంటూ సినీ నటులు మోహన్‌బాబు, విష్ణులకు పోలీసులు ఇచ్చిన నోటీసుల అమలును హైకోర్టు నిలిపివేసింది. నోటీ సుల ఆధారంగా విచారణకు మోహన్‌బాబు, విష్ణుకు హాజరు నుంచి మినహాయింపునిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.  కుటుంబానికి సంబంధించిన వివాదాల్లో అతి జోక్యం సరికాదని పోలీసులు, మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

వారి కుటుంబం లో మొదలైన సమస్యను వారే పరిష్కరించుకోవడానికి కొంత అవకాశం కల్పించాలని సూచించింది. అలా పరిష్కారం కాని పక్షంలో చట్టప్రకారం చర్యలు చేపట్టాలని చెప్పింది. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసుల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇంటివద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలన్న మోహన్‌బాబు అభ్యర్థనను తిరస్కరించింది.

ప్రతి రెండు గంటలకో సారి పరిస్థితులను పరిశీలిస్తుండాలని పోలీసులను ఆదేశించింది. వినతి పత్రం సమర్పించినా పోలీసులు రక్షణ కల్పించకపోవడంతోపాటు విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మంచు మోహన్‌బాబు, విష్ణు బుధవారం భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలం టూ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేనరెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మురళీ మనోహర్ వాదన లు వినిపిస్తూ.. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారన్నారు. మనోజ్ బౌన్సర్లతో ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడని,  భద్రత కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు.

ప్రభు త్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మనో జ్, మోహన్‌బాబులు పరస్పర ఫిర్యాదులు ఇవ్వడంతో కేసులు నమోదయ్యాయని తెలిపారు. విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశామని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల విచారణలో మోహన్‌బాబు, విష్ణులకు హాజరు నుంచి మినహాయింపునిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.