కౌన్సెలింగ్ అనంతరం మళ్లీ శ్మశానంలో వదిలిన కొడుకులు
జగిత్యాల, డిసెంబర్ 11 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిలుకవాడకు చెందిన అలకొండ రాజవ్వకు నలుగురు కొడుకులు ఉన్నా.. అచేతన స్థితిలో మోతె శ్మశానవాటికలో ఉన్న గదిలో వదిలి వెళ్లా రు. ‘అమ్మ బరువైంది’ శీర్షికన గత నెల 28న ‘విజయక్రాంతి’లో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ఆమె కొడుకులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. సంక్షేమశాఖ సఖి కేంద్ర సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని పోలీసుల సహాయంతో కొడుకులు శ్రీనివాస్, గోపాల్‌లకు అప్పజెప్పారు.
వారం తిరగకుండానే కొడుకు శ్రీనివాస్ మళ్లీ వృద్ధురాలిని స్మశానవాటికలోని గదిలో వదిలి వెళ్లారు. స్థానికులు జిల్లా సంక్షేమ అధికారి నరేష్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన ఆదేశాల మేరకు ఫీల్డ్ అధికారి కొండయ్య, సఖి సిబ్బంది సహాయంతో రాజవ్వను బుధవారం వృద్ధాశ్రమంలో చేర్పించారు. వృద్ధురాలి కుమారులను జగిత్యాల మెయింటనెన్స్ ట్రిబ్యునల్ ముందు హాజరుపర చాలని పోలీసులను జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ఆదేశించారు.