16-07-2024 01:20:06 AM
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ విజయ ప్రస్థానం
ముంబయి: భారత్‌లో బిలియనీర్ల సంఖ్య ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపీందర్ గోయల్ బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. జొమాటోలో దీపీందర్ గోయల్ వాటా 1 బిలియన్ డాలర్లను దాటడంతో ఈ ఘనతను సాధించారు. స్టాక్ మార్కెట్లో జొమాటో షేర్ల విలువ దాదాపు 2 శాతం పెరగడమే దీనికి కారణం. గత కొన్ని నెలలుగా జొమాటో షేర్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం ఈ కంపెనీ షేర్లు రూ.252 వద్ద 52 వారాల రికార్డు స్థాయిని తాకాయి.
ఈ క్రమంలో గత ఏడాది కాలంలో జొమాటో షేర్లు దాదాపు 190 శాతం రాబడిని ఇచ్చాయి. 2023 జులై కనిష్ట స్థాయి నుంచి కంపెనీ స్టాక్ 300 శాతానికి పైగా పెరిగింది. దీంతో దీపిందర్ గోయల్ బిలియ నీర్‌గా మారారు. జొమాటోలో గోయల్ దా దాపు 36.94 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. డాలరుకు రూ.83.55 మారకం రేటు ప్రకారం ఆ షేర్ల విలువ 1.02 బిలియన్ డాలర్లకు చేరుకుంది. జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం బ్లింకిట్ తోటి కంపెనీలను అధిగమించి ఊ హించిన దానికన్నా ముందే లాభదాయకంగా మారవచ్చన్న మార్కెట్ వర్గాల అంచనాల మధ్య గత ఏడాది ప్రారంభంనుంచి జొమాటో స్టాక్ గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్లింకిట్ ఆదాయం బ్రేక్‌ఈవెన్‌గా మారవచ్చని కంపెనీ ఇదివరకే ప్రకటించింది.
ఫీజులు పెంచి బిలియనీర్?
ఢిల్లీ, బెంగళూరులలో జొమాటో ప్లాట్‌ఫామ్ రుసుంను 6 రూపాయలకు పెంచు తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఏప్రిల్‌లోనే కంపెనీ ఈ రుసుంను రూ.4నుంచి రూ.5కు పెంచింది. వాస్తవానికి జొమాటో గత ఆగస్టులో రూ.2 ప్లాట్‌ఫామ్ రుసుంను వసూలు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత దాన్ని రూ.3కు పెంచింది. కొత్త సంవత్సరం సందర్భంగా రికార్డు ఫుడ్ ఆర్డర్లతో ఈ ఏడాది జనవరిలో కాలకమార్కెట్లలో తప్పనిసరి ప్లాట్‌ఫామ్ రుసుంను రూ.3 నుంచి రూ.4కు జొమాటో పెంచింది. వాస్తవానికి ఆగస్టులో ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన తర్వాతే జొమాటో లాభాలను ఆర్జించడం మొదలు పెట్టింది. ఆ క్రమంలో సెప్టెం బర్ త్రైమాసికంలో కంపెనీ రూ.36 కోట్ల లభం ఆర్జించింది. ఆ తర్వాత డిసెంబర్ త్రై మాసికంలో కంపెనీ లాభం రూ.138 కోట్లకు పెరిగింది. ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచిన తర్వాతే కంపెనీ లాభాలు పెరిగాయనేది కాదనలేని నిజం.
ఏటా 85 కోట్ల ఆర్డర్లు
ఇక జొమాటో వ్యాపారం విషయానికి వస్తే కంపెనీ ప్రతి సంవత్సరం 85 90 కోట్ల ఆర్డర్లు ఆందిస్తుంది. ఈ విధంగా చూస్తే కంపెనీ ఈ ఆర్డర్లనుంచి అదనంగా ఒక రూపాయి పెంచినా కంపెనీకి ఏటా రూ.8590 కోట్ల ఆదాయం వస్తుంది. జొమాటో ప్రతి రోజూ సగటున 25నుంచి 30 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుంది. అంటే కంపెనీ ప్రతి ఆర్డర్‌పై అదనంగా ఒక రూపాయి వసూలు చేసినా రూ.2530 లక్షలు ఆదాయం వస్తుంది.
లగ్జరీ జీవితం
దీపిందర్ వ్యక్తిగత జీవితం కూడా లగ్జరీగానే ఉంటుంది. లగ్జరీ కార్లంటే ఇష్టపడే దీపిందర్ ఇటీవలే రూ.4.5 కోట్ల విలువైన ఆస్టన్ మార్టన్ DB12 స్పోర్ట్స్ కారు కొన్నారు. ఈ మోడల్ తొలి కారు దేశంలో ఇదేనట. ఇదే కాకుండా దీపిందర్ వద్ద కోట్ల విలువ చేసే మరికొన్ని కారు కూడా ఉన్నాయి. ఆయన ఇటీవల ఢిల్లీలోని మెహ్రౌలీలో 5 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేశారు. దాని విలువ రూ. 79 కోట్లు ఉంటుందని అంచనా. దీపిందర్ గోయల్ మెక్సికోకు చెందిన ప్రముఖ మోడల్ గ్రెసియా మునోజ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.
మాజీ మోడల్ అయిన ఆమె లగ్జరీ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ స్పేస్‌లో సొంత స్టార్టప్‌ను నడుపుతోంది.దీపిందర్ గతంలో ఐఐటిలో చదువుతున్నప్పుడు పరిచయమైన కంచన్ జోషీని వివాహం చేసుకున్నారు, కానీ కొంతకాలానికే వారిద్దరూ విడిపోయారు. పేద కుటుంబంలో పుట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న దీపిందర్‌ను ప్రధాని మోడీ సైతం ఇటీవల ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు.
మధ్య తరగతి కుటుంబం నుంచి..
మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన దీపిందర్ ఐఐటి ఢిల్లీనుంచి మ్యాథమేటిక్స్, కంప్యూటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆహారం పట్ల మక్కువతో స్ఫూర్తి పొంది ఫుడ్ ఆర్డర్ చేయడానికి యాప్‌ను రూపొందించారు. బెయిన్& కంపెనీలో ఉన్నప్పుడే FoodieBay.comను స్థాపించారు. ఆ తర్వాత దాన్ని Zomato.com గా మార్చారు.2011లో ఇన్ఫో ఎడ్జ్‌నుంచి నిధులు లభించడంలో గోయల్‌తో పాటుగా ఆయన బృందం తమ ఉద్యోగాలను వీడి జొమాటో వృద్ధిపై పూర్తిగా దృష్టిపెట్ట్టారు. 2018లో జొమాటో యూనికార్న్‌గా మారింది.