calender_icon.png 29 September, 2024 | 7:56 AM

సాధారణం నుంచి అసాధారణంగా..

29-09-2024 01:47:38 AM

  1. అతిపెద్ద ఉగ్ర సంస్థ అధినేతగా ఎదిగిన..
  2. చిరు కూరగాయల వ్యాపారి కొడుకు
  3. 32 ఏండ్లకే హెజ్బొల్లా అధినేతగా బాధ్యతలు
  4. అనేక దాడుల నుంచి బయటపడిన నస్రల్లా

బీరుట్, సెప్టెంబర్ 28: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా అధినేత నస్రల్లా చనిపోవటంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్ మద్దతుతో కొన్ని దశాబ్దాలుగా అసాధారణంగా బలపడుతూ వస్తున్న హెజ్బొల్లా మూడు నెలల వ్యవధిలోనే ఇజ్రాయెల్ చేతిలో టాప్ కమాండర్లందరినీ కోల్పోయింది.

హసన్ నస్రల్లాకు లెబనాన్‌తోపాటు ఇస్లామిక్ ప్రపంచంలో గొప్ప పేరే ఉన్నది. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన అనతికాలంలోనే ఇజ్రాయెల్‌కు పక్కలో బల్లెంలా మారాడు. నస్రల్లా జీవిత ప్రస్థానానాన్ని ఒకసారి పరిశీలిస్తే..

v లెబనాన్ రాజధాని బీరుట్‌లో తూర్పు ప్రాంతంలోని బౌర్జ్ హమ్మౌద్‌లో సయ్యద్ హసన్ నస్రల్లా 1960లో ఒక సాధారణ కూరగాయల వ్యాపారి కుటుంబంలో జన్మించాడు. కుటుంబంలోని 9 మంది పిల్లల్లో నస్రుల్లానే పెద్దవాడు. 

v 1975లో షియా మిలీషియా గ్రూప్ అమల్ మూవ్‌మెంట్‌లో చేరాడు. ఏడేండ్లు అందులో పనిచేసిన తర్వాత కొంతమంది సహచరులతో కలిసి బయటకు వచ్చి 1982లో ఇస్లామిక్ అమల్ అనే సంస్థను స్థాపించారు.  అదే తర్వాత హెజ్బొల్లాగా మారింది. ఇరాన్ మద్దతుతో ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక మిలీషియా సంస్థగా ఎదిగింది. 

v 1985లో హెజ్బొల్లా పేరును అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయటమే లక్ష్యమని ప్రకటించింది. 

v సంస్థ ప్రారంభంలో దానికి అబ్బాస్ అల్ ముసావీ నాయకత్వం వహించారు. 1992లో ఇజ్రాయెల్ జరిపిన హెలికాప్టర్ దాడిలో అబ్బాస్ చనిపోయాడు. దీంతో 32 ఏండ్ల వయసులో నస్రల్లా ఆ సంస్థ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. 

v నస్రల్లా ఆదేశాలతో టర్కీ, అర్జెంటీనాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. అర్జెంటీనాలో జరిగిన దాడిలో 29 మంది మరణించారు. 

v నస్రల్లాను చంపేందుకు ఇజ్రాయెల్ చేయని ప్రయత్నం లేదు. 2006లో జరిపిన వైమానిక దాడిలో తృటిలో తప్పించుకొన్నాడు. అప్పటి నుంచి ఆయన బయట కనిపించటం మానేశారు. 

కొత్త సారధి సఫీద్దీన్?

ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లాతోపాటు టాప్ కమాండర్లంతా చనిపోవటంతో హెజ్బొల్లాకు తదుపరి నాయకుడు ఎవరు అనే అంశంపై చర్చ నడుస్తున్నది. నస్రల్లా బంధువు హషెమ్ సఫీద్ధీన్ పేరు కొత్త సారధి జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్నది. సఫీద్ధీన్‌ను అమెరికా 2017లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయన ప్రస్తుతం హెజ్బొల్లాకు అంతర్జాతీయంగా రాజకీయ వ్యవహారాల ప్రతినిధిగా ఉన్నారు.

హెజ్బొల్లా అత్యున్నత నిర్ణాయక విభాగం జిహాద్ కౌన్సిల్‌లో సభ్యుడు కూడా. ఇరాన్ మిలిటరీ జనరల్‌గా పనిచేసిన ఖ్వాసెమ్ సోలెమనీ తన కుమార్తె జీనబ్ సోలెమనీని సఫీద్ధీన్ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. నస్రల్లా మాదిరిగానే సఫీద్ధీన్ కూడా మత గురువే. ఈయన దక్షిణ లెబనాన్‌లోని దెయిర్ ఖానున్ ల్ నహర్‌లో 1964లో జన్మించాడు. 1990 నుంచి నస్రల్లా తర్వాత ఈయనే హెజ్బొల్లా నాయకుడు అవుతారని ప్రచారం జరుగుతున్నది. ఈయనపై సౌదీ 2017లో నిషేధం విధించింది. 

భారత్ అదృష్టం.. ఇరాన్ శాపగ్రస్తం 

గాజాపై భీకర సాయుధ పోరాటం మొదలుపెట్టిన తర్వాత మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ.. ఆసక్తికర చిత్రాలను చూపి అందరిని దృష్టిని ఆకర్శించారు. కుడిచేతిలో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలను చూపిస్తున్న మ్యాప్‌ను పట్టుకొన్న నెతన్యాహు.. ఆ దేశాలను శాపగ్రస్త దేశాలుగా అభివర్ణించారు. వాటిని నలుపు రంగులో చూపించారు.

ఎడమ చేతిలో ఈజిప్టు, సూడాన్, సౌదీ అరేబియా, ఇండియా చిత్రాలు ఉన్న మ్యాప్‌ను చూపించి ఇవి ఉత్తమ దేశాలు (బ్లెస్సింగ్) అని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఘర్షణలకు ఇరాన్ కారణమని ఆరోపించారు. కాగా, నెతన్యాహూ ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాల రాయబారులు లేచి బయటకు వెళ్లిపోయారు. గాజాపై దాడులను నిరసిస్తూ వారు వాకౌట్ చేశారు.