కలలు అందరు కంటారు. కానీ కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. పేదరికం కూలీగా మార్చినా.. ఆర్థిక పరిస్థితులు వెంటాడినా అనుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు నిర్మల్ జిల్లాకు చెందిన రేంజర్ల శిరీష. ఆడపిల్ల అయినా చక్కగా చదువుకొని అమ్మనాన్నలు అందించిన ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించింది. చదువుల సరస్వతిగా కుటుంబానికే కాదు.. ఆ ఊరికి మంచి పేరు తీసుకొచ్చిందామె.
మందపల్లి.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఓ మారుమూల గ్రామం. కనీస సౌకర్యాలు అంతంత మాత్రమే. విద్యా వనరులు తక్కువే. అలాం టి పరిస్థితుల్లో చదువును కొనసాగించింది రెంజర్ల శిరీష. తల్లిదండ్రులు ఆశన్న, నర్సవ్వ. నలుగురు కుమార్తెలతోపాటు ఒక కుమారుడు. అందులో మూడో సంతానం శిరీష. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు.
ఒకవైపు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. అధిక సంతానం, పేదరికం వెంట డినా పిల్లల చదువుకు చేయూతనిచ్చారు. అందరూ ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నారు. శిరీష కూడా పదో తరగతి వరకు ప్రభుత్వ బడిలోనే చదువుకుంది.
“చదువాలనే సత్తా, ఆసక్తి ఉండాలే కానీ.. ఏ బడైనా ఒక్కటే. మా అమ్మనాన్నలు మొదట్నుంచీ ఇదే విషయం చెప్పేవారు. అందుకే పదో తరగతి వరకు ప్రభుత్వ బడిలోనే చదువుకొ ని మంచి మార్కులు సాధించా. మా ఊర్లో మొదటిసారి ఫస్ట్ క్లాస్ పాస్ అయింది నేనే” అని అంటారు శిరీష.
కూలీ పనులు చేసి..
తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో శిరీష కూడా కూలీ పనులు పనిచేసిం ది. ఒకపూట చదువుకుంటూ.. మరోపూట కూలీ పనులకు వెళ్లేది. వచ్చిన డబ్బులతో కుటుంబ అవసరాలకు ఖర్చుచేస్తూ.. తాను చదువుకోవడం మొదలుపెట్టింది. సెలవులు, పండుగల సమయంలో స్నేహితులంతా కుటుంబసభ్యులతో గడపడానికి ఇష్టపడితే.. శిరీష మాత్రం పొలం పనులకు వెళ్లి పాకెట్ మనీ సంపాదించుకునేది.
“వ్యవసాయంలో కలుపు తీయడం, నాటు వేయడం, పొలం దున్నడం లాంటివి వచ్చు. ఇంట్లో నాతోపాటు అందరు చదువుకునేవాళ్లం. చదువులకు డబ్బు సమకూ ర్చడం కష్టంగా ఉండేది. అందుకే కూలీ చేయాల్సిన పరిస్థితి. చదువుల కోసం అప్పులు చేసిన సందర్భాలున్నాయి. మళ్లీ పొలం పనులు చేసి ఆ అప్పు తీర్చేదాన్ని.. అలా ఇంటర్ వరకు చదువుకున్నా” అని తన బాధలను గుర్తుచేసుకుంది శిరీష.
విద్యా వాలంటీర్‌గా..
ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలన్నది శిరీష కల. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ వరకే చదవాల్సి వచ్చింది. అయితే అమ్మనాన్నలపై ఆధారపడకుండా విద్యావాలంటీర్‌గా పనిచేసింది. శిరీష ప్రతిభను గుర్తించిన అధికారులు సొంతూరులోనే వాలంటీర్‌గా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఒకవైపు వాలంటీర్‌గా పాఠాలు చెబుతూనే.. మరోవైపు టీటీసీ ప్రిపేర్ అయ్యింది.
అయితే పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది. అందుకోసం విద్యావాలంటీర్ జాబ్ మానేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. అయితే ప్రభుత్వం ఎన్నోసార్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసి.. ఆ వెంటనే రద్దు చేసేది. ఇలాంటి పరిస్థితుల్లోనూ శిరీష చదువును నిర్లక్ష్యం చేయలేదు.
ప్రభుత్వ ఉద్యోగం
ఈ ఏడాది మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఇంటి వద్దే పరీక్షకు సన్నద్ధమైంది. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా డీఎస్సీ-2024 లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించింది. అయితే శిరీషకు గవర్నమెంట్ జాబ్ రావడంతో కుటుంబమే కాదు.. ఊరి గ్రామస్తులంతా అభినందనలు తెలిపారు. “చదువు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డా..
నా స్నేహితులంతా పెళ్లి చేసుకొని సెటిల్ కావడంతో ‘శీరిష నీ పెళ్లి ఎప్పుడు’ అని విమర్శించినవాళ్లు ఉన్నారు. చదవుతోనే మంచి భవిష్యత్తు అని నమ్మా. టీచింగ్ ఫీల్డ్‌లోకి రావడం అమ్మన్నాన కల కూడా. కానీ చిన్న వయసులోనే ప్రభుత్వ కొలువు సాధించడం గర్వంగా ఉంది. నాలాం టి పేద పిల్లలకు పాఠాలు చెప్పే అవకాశం దక్కింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదవాలనుంది’ అని అన్నారు శిరీష.
బాలు జాజాల
నా బిడ్డ కష్టం ఫలించింది
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏరోజు చదువుకోవడం ఆపలేదు. మాతోపాటు కూలీ పనులు చేసింది. తోట పనులు కూడా వెళ్లేది. ఆడపిల్లే అయినా మగోడి లా కష్టపడింది. తోటి పిల్లలతో పెళ్లిళ్లు చేసుకుంటే.. మా అమ్మాయి మాత్రం చదువుకోవడానికే ఇష్టపడది. మొదటిసారి గవర్నమెంట్ జాబ్ కొట్టడంతో ఊర్రోళ్లంతా నాకు, నా బిడ్డకు సన్మానం చేశారు. అందరూ నా బిడ్డను పొగుడుతుంటే ఏడ్చేశాను. తల్లిగా నా భారం తీరిపోయింది.
శిరీష తల్లి నర్సవ్వ