calender_icon.png 23 October, 2024 | 2:56 PM

కుమ్రంభీం నుంచి లక్ష్మణ్ బాపూజీ వరకు..

17-09-2024 05:04:59 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జల్, జంగల్, జమీన్ నినాదంతో కుమ్రంభీం నైజాం ప్రభువుతోపాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఆయన స్వస్థలం ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లి గ్రామం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఈ ప్రాంత యువకులు మహారాష్ట్రలోని చంద్రా పూర్, బల్లార్షా, ధాబాల వంటి గ్రామాల్లో ప్రత్యేక మిలటరీ శిక్షణ తీసుకున్నారు. ఆసిఫాబాద్‌కు చెందిన రామచంద్రారావు పైకాజీ శిక్షణకు సాయం ఆర్థిక సాయం అందించారు. పైకాజీతో పాటు అన్నాజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యూహాకర్తలుగా వ్యవహరించారు. దీంతో పైకాజీపై నైజాం తొత్తులు హత్యాయత్నం కూడా చేశారు. 1948 సెప్టెంబర్13న భారత ప్రభుత్వం నిజాం పాలనపై మిలటరీ యాక్షన్ ప్రకటించింది.

ఇదే రోజు చంద్రపూర్ నుంచి సైనిక దళాలు హైదరాబాద్ వైపు కదలాయి. వర్థా నది రైల్వే వంతెనకు నిజాం రజాకార్లు బాంబును అమర్చగా, భారత సైనికులు రజాకార్లను హతమార్చి బాంబును తొలగించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పోరాటయోధులు ఇదే రోజు వీరూర్ రైల్వేస్టేషన్ ధ్వంసం చేశారు. గ్రనేడ్ పేలి ఆసిఫాబాద్‌కు చెందిన బోనగిరి వెంకటేశం గాయపడ్డాడు. తర్వాత కొన్నిరోజులకు దహెగాం మండలంలోని పెసరుకుంట వద్ద పొంచి ఉన్న 200 మంది రజాకార్లకు భారత సైన్యానికి మధ్య భీకర పోరాటం జరిగింది. ఘటనలో 19 మంది ఉద్యమకారులు మరణించాగా పలువురు గాయపడ్డారు. ఆపరేషన్ పోలో తర్వాత ఆసిఫాబాద్ జైలు నుంచి 200 మంది ఖైదీలు విడుదలయ్యారు.