calender_icon.png 23 October, 2024 | 11:31 PM

వివాదాల నుంచి విజయం వరకు!

03-09-2024 12:00:00 AM

చిదిమ్మా అడెత్షినా.. దక్షిణాఫ్రికాకు చెందిన 23 ఏళ్ల న్యాయ విద్యార్థిని. అడెత్షినా తండ్రి నైజీరియన్, తల్లి దక్షిణాఫ్రికా చెందిన మహిళ. తాజాగా జరిగిన ‘మిస్ యూనివర్స్ నైజీరియా’గా దక్షిణాఫ్రికా బ్యూటీ విజేతగా నిలిచారు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాల ఎదురుకోవాల్సి వచ్చింది. తల్లి ఐడెంటిటీతో గుర్తింపు తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఎన్నో అవమానాలను, అడ్డంకులను, వివక్షను మౌనంగా ఎదుర్కొని తన గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది బ్యూటీ.

పౌరసత్వం కారణంగా ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఈ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె ‘మిస్ యూనివర్స్ నైజీరియా’గా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. తన కల నెరవేరిందన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ కిరీటం అందానికి మాత్రం కాదు.. ‘ఐక్యతకు పిలుపు’ అని అడెత్షినా చెప్పారు. ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరవంగానూ ఉంది. ఈ ఆనంద క్షణాల్లో నా మనసులో ఎప్పటి నుంచో దహించుకుపోతున్న ఒక విషయం అందరికీ చెప్పాలి.. “ఆఫ్రికన్ అంతా ఐక్యంగా ఉండాలి. శాంతియుతంగా కలిసి మెలిసి ఉండాలనే నా ఆలోచన. ఆఫ్రికా దేశాలను విభజించే అడ్డంకులను మనమందరం తొలగించాలి. ప్రతి ఆఫ్రికన్ ఈ ఖండంలో స్వతంత్రంగా తిరగాలి. ఆఫ్రికా ఖండం అభివృద్ధి కోసం మనమంతా పాటు పడాలి” అని ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చింది అడెత్షినా.