calender_icon.png 11 October, 2024 | 4:05 AM

4 బిలియన్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు..

11-10-2024 01:52:38 AM

రతన్ టాటా సారథ్యంలో టాటా గ్రూప్ ప్రయాణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గుండు సూదుల నుంచి రైలింజన్ల వరకూ టాటాలు దేశంలో ఉత్పత్తి చేయని వస్తువేదీ లేదంటూ తరతరాలుగా అందరూ చెప్పుకునే మాట. జంషెడ్‌జీ టాటా నుంచి జేఆర్‌డీ టాటా వరకూ పలు వ్యాపారాల్ని విజయవంతంగా నిర్వహించారు.

వారి వారసుడిగా 1991లో టాటా గ్రూప్ పగ్గాలు చేపట్టిన రతన టాటా గ్రూప్‌ను విశ్వవ్యాప్తం చేశారు. టాటా సన్స్ చైర్మన్‌గా  రతన్ టాటా సారథ్యం వహించిన కాలంలో (1991 నుంచి 2012 వరకూ) టాటా గ్రూప్ ఆదాయం 4 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్ల మార్క్‌కు చేరుకున్నది. ఎ

న్నో నవకల్పనలు, వ్యూహాత్మక విక్రయాలు, టేకోవర్లు, అంతర్జాతీయ విస్తరణలతో టాటా గ్రూప్‌ను రతన్ పరుగులు తీయించారు. అంతర్జాతీయ టేకోవర్ల ద్వారా పలు కొత్త రంగాల్లోకి టాటా గ్రూప్‌ను విస్తరించారు. 2012లో టాటా సన్స్ చైర్మన్‌గా రతన్ టాటా పదవీ విరమణ చేసేనాటికి గ్రూప్ ఆదాయంలో 60 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారానే సమకూరేది. 

టాటా గ్రూప్‌లో ప్రస్థానం

రతన్ టాటా 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు. 1991లో చైర్మన్ అయ్యేనాటికి  జేఆర్‌డీ టాటా నేతృత్వంలో గ్రూప్ కంపెనీల నాయకత్వం వికేంద్రీరణ ఉండేది. రతన్ టాటా బొంబే హవుస్‌లో (గ్రూప్ కేంద్ర కార్యాలయం) నాయకత్వాన్ని కేంద్రీకృతం చేసి గ్రూప్‌ను కొత్త పుంతలు తొక్కించారు. 

గ్రూప్ పునర్‌వ్యవస్థీకరణ

రతన్ టాటా నేతృత్వంలో టాటా గ్రూప్‌ను పునర్‌వ్యవస్థీకరించారు. గ్రూప్ రాణించని రంగాలైన సిమెంట్, టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్ వ్యాపారాల్ని విక్రయించారు. సాఫ్ట్‌వేర్, స్టీల్ వ్యాపారాల్ని మరింత పటిష్ఠపరిచడంతో పాటు కొత్తగా టెలికమ్యూనికేషన్లు, పాసింజర్ కార్లు, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, రిటైల్, ఏవియేషన్ వ్యాపారాల్ని ప్రారంభించారు. 

అంతర్జాతీయ టేకోవర్లు, భాగస్వామ్యాలు

టాటా గ్రూప్ వ్యాపారాలకు  ఏఐఏ, స్టార్‌బక్స్, కుమ్మిన్స్ తదితర అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యం కుదిర్చారు. జాగ్వర్ ల్యాండ్ రోవర్, టెట్లీ, కోరస్‌లతో సహా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను రతన్ హయాంలోనే టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. టాటా గ్రూప్‌కు లభించే ఆదాయంలో 100పైగా దేశాల నుంచి 60 శాతం వరకూ సమకూరేలా తీర్చిదిద్దారు.

దేశంలో నంబర్ వన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను (టీసీఎస్) 2004లో పబ్లిక్ ఇష్యూకు తీసుకువచ్చి 1.17 బిలియన్ డాలర్లను సమీకరించగలిగారు. అప్పటికి దేశంలో అదే పెద్ద ఐపీవో. టీసీఎస్ ఐపీవో ద్వారా సమీకరించిన నిధులతో గ్రూప్‌కు గట్టి ఆర్థిక పునాది ఏర్పడటంతో పాటు టేకోవర్లకు అవసరమైన మూలధనం సమకూరింది. 

ఇండికా కష్టాలు..నానో ఆవిష్కరణ

రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. 1998లో ఇండికా కారును ప్రవేశపెట్టిన తర్వాత టాటా మోటార్స్‌కు రూ.500 కోట్ల నష్టం వచ్చింది. దీంతో షేర్‌హోల్డర్ల నుంచి తీవ్ర ప్రతికూలత వ్యక్తంకావడంతో రాజీనామా చేసేందుకు సైతం రతన్ టాటా సిద్ధమయ్యారు. ఆ తర్వాత తక్కువ ధరలో కుటుంబం ప్రయాణించేందుకు వీలైన నానో కారు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

ప్రపంచంలోకెల్లా చౌకైన కారుగా ప్రమోట్ చేశారు. ఈ నానో ప్రాజెక్టుకు సేకరించిన భూములపై  పశ్చిమ బెంగాల్‌లో నిరసనల్ని ఎదుర్కోవడం తదుపరి ఆ ప్రాజెక్టను గుజరాత్‌కు మార్చడంలో రతన్ ఎన్నో ఇబ్బందుల్ని చవిచూశారు. ప్రాజెక్టు జాప్యంతో వ్యయాలు పెరిగి రతన్ ఆశించిన రూ.1 లక్షకు నానో కారును 2005లో ఇవ్వలేకపోయారు.

ఆ సమయానికి ఆటోమొబైల్ మార్కెట్ మార్పులకు లోనుకావడంతో నానో కారు ప్రాజెక్టు విఫలయత్నంగా మిగిలింది. 2001లో టాటా ఫైనాన్స్‌లో రూ.500 కోట్లు కుంభకోణం జరిగింది. టాటా ఫైనాన్స్‌లో మదుపుచేసిన వారికి చెల్లింపులు చేస్తామని రతన్ టాటా హామీ ఇచ్చి ఆ ఫైనాన్స్ సంస్థను టాటా మోటార్స్‌లో విలీనం చేశారు. 2008 నవంబర్‌లో ముంబైలోని టాటా గ్రూప్ హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్‌పై ఉగ్రవాదుల దాడి కూడా గ్రూప్‌కు మచ్చతెచ్చింది.