calender_icon.png 21 January, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్

17-07-2024 02:57:57 AM

  • నేరస్థులతో అవసరం లేదు 
  • డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి 
  • పోలీస్, ఎక్సైజ్ కలిసి పనిచేయాలి 
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, ప్రాంత పరిస్థితుల ఆధారంగా ప్రతి కలెక్టర్ ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఆయా కార్యక్రమాలపై కలెక్టర్ల ముద్ర స్పష్టంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సదస్సులో పలు అంశాలపై సీఎం మార్గనిర్దేశం చేశారు. జాతీయ రహదారులకు భూసేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి పైనా దృష్టి సారించాలన్నారు. జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రుల కార్యక్రమాలకు సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

శాంతిభద్రతల్లో రాజీ వద్దు 

రాష్ర్టంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ నేరస్థులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పబ్బులకు టైమింగ్ పెట్టొచ్చని, ఆంక్షల పేరుతో రాత్రి వేళ్లల్లో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని నగర కమిషనర్లకు సీఎం సూచించారు. ఐటీ ఉద్యోగులు రాత్రివేళల్లో పనిచేస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూ చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్‌హెచ్‌వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించారు. గణాంకాలతో ఆ వివరాలను మీడియాకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో పోలీసు, ఎక్సుజ్, టీజీ న్యాబ్ అధికారులు సమన్వయం చేసుకొని ముందు కు సాగాలని సీఎం స్పష్టంచేశారు. డ్రగ్స్ కేసుల్లో విదేశీయులు పట్టుపడుతున్నారని, వారు ఏ పని మీద రాష్ట్రానికి వస్తున్నారు? ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్‌తో పట్టుపడిన వారిని డీఅడిక్షన్ సెంటర్లో ఉంచాలని, ఇందుకోసం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలన్నారు. 

ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు స్థలాలు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, అక్కడికి సమీపంగా ఉండే గ్రామాలు, పట్టణాల్లో వాటికి స్థలాల ఎంపిక చేయాలని సీఎం సూచించారు. ఎవరు ముందుగా స్థలాలు ఎంపిక చేస్తే వారికి వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్టంలోని 65 ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్లు తమ పరిధిలోని ఐటీఐలను సందర్శించి వాటిని ఏటీసీలుగా మార్చే ప్రక్రియ ఎలా సాగుతుందో పరిశీలించాలన్నారు.

అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నందున ప్రస్తుతం ఉన్న ఐటీఐల్లో స్థలం సరిపోకపోతే ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేసుకోవాలని సూచించారు. విద్యారంగానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో బడుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలని, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేసేలా చూడాలని ఆదేశించారు.

కలెక్టర్లు పాఠశాలలు తనిఖీ చేసిన తర్వాత అక్కడ సమస్యలు పరిష్కారం కావాలని, లేకుంటే ఆ తనిఖీలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్నారు. మధ్యాహ్న భోజనం మరింత మెరుగ్గా అందించేందుకు హరేకృష్ణ మూవ్‌మెంట్ వంటి సంస్థల సహకారం తీసుకునే అంశంపై అధ్యయనం చేయాలని విద్యా శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 

అటవీ భూముల్లో పండ్ల మొక్కలు

అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడం వలన ఓ వైపు గిరిజనులకు ఆదాయం, మరోవైపు పచ్చదనం పెంపొందుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. గిరిజనులకు ఆదాయం లేకనే పోడు వ్యవసాయంపై ఆధారపడుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చిన భూముల్లో మామిడి, సీతాఫలం, జామ వంటి పండ్ల మొక్కలు నాటిస్తే సీజన్ల వారీగా ఆ కుటుంబాలకు ఆదాయం వస్తుందన్నారు. తద్వారా కోతుల సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని సీఎం తెలిపారు. 

తాటి, ఈత చెట్లను సైతం

వికారాబాద్ గాలి.. టీబీకి మందు నానుడి ఉందని, కానీ ఇప్పుడు వికారాబాద్ అటవీ ప్రాంతం చాలా వరకు ఖాళీగా ఉందన్నారు. అక్కడ గతం మాదిరి ఔషధ మొక్కలు నాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పులుల సఫారీకి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మహారాష్ర్టలోని తడోబా అటవీ ప్రాంతానికి వెళుతున్నారని, మన దగ్గర ఆదిలాబాద్‌లోనూ అటవీ ప్రాంతం ఉన్నా పులులు సంచారం లేదని, వాటికి అవసరమైన ఆవాసం కల్పిస్తే అటవీ పర్యాటకం పెంపొందించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. 

వనమహోత్సంలో మనం నాటే మొక్కలు 50 ఏళ్ల పాటు ఫలసాయం అందించేలా ఉండాలని సూచించా రు. కలెక్టర్లు నెలకోసారి అటవీ ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు. గతంలోలా ప్రభుత్వ భూమి లభ్యత లేనందున ప్రాజెక్టు కట్టలు, కాలువ కట్టలు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలని, మూడునాలుగేళ్లలో గీత వృత్తిదారులకు ఆదాయం వచ్చేలా హైబ్రిడ్ మొక్కలు నాటాలని ఆదేశించారు. 

కల్తీపై కఠినంగా వ్యవహరించాలి 

కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు, యూరియా సిద్ధంగా ఉన్నాయని, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే కలెక్టర్లు జాగ్రత్త వహించాలని మంత్రి అన్నారు.