జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డి.రాజేష్ బాబు...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): సమాజంలోని బాలబాలికల సంరక్షణ కొరకు స్నేహ పూర్వకమైన న్యాయ సేవలు అందించాలన్న లక్ష్యంతో గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ సబిత ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు జరిగిందని నాగర్ కర్నూల్ జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు తెలిపారు. గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు ఈ కమిటీలోని సభ్యులందరికీ వివిధ రకాల రిసోర్స్ పర్సన్స్ ద్వారా జెజెపి ఆక్ట్, ఫోక్సొ ఆక్ట్, సిడబ్ల్యూసి కమిటీ బాధ్యతలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ యొక్క బాధ్యతల గురించి వివరంగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. (డిఎల్ఎస్ఏ) నిర్వహణలో ఏలాంటి తప్పులకు తావివ్వకుండా, స్వచ్ఛందంగా పనిచేస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.
ఈ సందర్భంగా సభ్యులకు సూచించారు. 18 ఏళ్ల లోపు చిన్నారులు బాధితులుగా, సాక్షులుగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారుగా గుర్తించినప్పటికీ ఏ సందర్భంలోనూ వాళ్ళకు అవమానం జరగకుండా చిన్నారులతో స్నేహ పూర్వకంగా మెలిగి సేవలందించాలన్నారు. ఉజ్వల, సఖి, షీటీం, భరోసా, బాల సదన్ తదితర అన్ని రకాల ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకొని పిల్లల ఎదుగుదల కోసం కృషి చేయాలన్నారు. అంతకుముందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ... ప్యారాలీగల్ లాయర్లు, ప్యారా లీగల్ వాలంటీర్స్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లుప్తంగా వివరించారు. నిస్సహాయులకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి సంస్థ తరఫున న్యాయవాదులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని కేసు ఫైల్ చేసిన రోజు నుండి అప్పీలు ఫైనల్ వరకు బాధ్యత వహిస్తారన్నారు. మొదటి రోజు ఏఎస్పి రామేశ్వర్ మాట్లాడుతూ... చిన్నారులకు ఏ సందర్భంలోనూ చేతులకు హాండ్స్ కప్స్ వేయద్దని, రాత్రి వేళల్లో వారిని స్టేషన్లో ఉంచుకోవడానికి వీల్లేదన్నారు. పిల్లలతో వ్యవహరించే క్రమంలో యూనిఫామ్ ధరించడం కూడా నిషేధమన్నారు.
జేజేబి బోర్డు సభ్యురాలు గిరిజ ప్రీతి మాట్లాడుతూ.. మూట సహాయం కాకుండా కేవలం మాట సహాయం చేసి సమాజంలోని పిల్లలు, మహిళలు, వృద్దులు దివ్యాంగులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. అంతకుముందు సైకాలజిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంబుజా మాట్లాడుతూ.. మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లల పట్ల వివక్ష చూప్పొద్దన్నారు. చిన్నపిల్లల మానసిక స్థితి గురించి మానసిక సంరక్షణ గురించి వారిని ఎలా కాపాడుకోవాలో అనే అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగలెర్ డిఫెన్స్ కౌన్సిల్ మధుసూదన్ రావు, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ లక్ష్మణ్ రావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీశైలం, జిల్లా విద్యాశాఖ రిసోర్స్ పర్సన్ వెంకటయ్య, దేవిక, కేశవరెడ్డి, రాజు, బాలరాజు డిఎల్ఎస్ఏ కమిటీ సభ్యులు గుండూరు శ్యాంసుందర్, మల్లేష్, బాలస్వామి, తిరుపతయ్య, మల్లీశ్వరి, పార్వతమ్మ ఇతర కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.