calender_icon.png 6 April, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిత్ర విభూషణ మోదీ

06-04-2025 01:24:31 AM

  1. అత్యున్నత పురస్కారంతో సత్కరించిన శ్రీలంక
  2. రక్షణ రంగంలో మొదటి ఒప్పందం
  3. అధ్యక్షుడిగా దిసనాయకే బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మొదటి పర్యటన
  4. శ్రీలంక ప్రతిపక్ష నాయకుడితోనూ భేటీ అయిన మోదీ

కొలంబో, ఏప్రిల్ 5: భారత ప్రధాని నరేంద్ర మోదీని శ్రీలంక ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘మిత్ర విభూషణ’తో సత్కరించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు మోదీని ఈ అవార్డుతో సత్క రించినట్లు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిసనాయకే తెలిపారు.

దిసనాయకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మోదీ లంక పర్యటనకు వెళ్లారు. దిసనాయకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకను సందర్శించిన మొద టి విదేశీనేత మోదీనే కావడం గమనార్హం.

డిసెంబర్‌లో దిసనాయకే భారత్‌ను సందర్శించనున్నారు. పదవి చేపట్టిన తర్వాత దిస నాకే తొలి విదేశీ పర్యటన ఇదే. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవి చేపట్టిన తర్వాత శ్రీలంక పర్యటన ఇదే తొలిసారి. శుక్రవారం  

సాయంత్రమే మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక శనివారం ఉదయం ఇండిపెండెన్స్ స్కేర్ వద్ద శ్రీలంక అధ్యక్షుడు తదితరులు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీ శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసతో కూడా భేటీ అయ్యారు. 

ఏడు కీలక ఒప్పందాలు

మోదీ పర్యటనలో భాగంగా ఏడు రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. తొలిసారిగా భారత్, శ్రీలంక మధ్య రక్షణ రంగంలో ఒప్పందం కుదరడం విశేషం. కేవలం రక్షణ రంగంలో మాత్రమే కాకుండా ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్యం మొదలైన రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.

అంతే కాకుండా ఈ ఇద్దరు నేతలు కలిసి సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘శ్రీలంక, భారత్ భద్రతా ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకోసమే రక్షణ రంగంలో కీలక ఒప్పందం చేసుకున్నాం.

మత్య్సకారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అంగీకారానికి వచ్చాం. లంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని నమ్ముతున్నా. భారత్‌కు ప్రయోజనం చేకూర్చేలా అధ్యక్షుడు సహకరించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

ఇక శ్రీలంక అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరినీ లంక భూభాగాన్ని వినియోగించుకోనివ్వం. క్లిష్టసమయాల్లో భారత్ అందిస్తున్న మేలు మరువ లేనిది’ అని అన్నారు. 

జాలర్లకు ఊరట.. 

మోదీ పర్యటనలో భాగంగా శ్రీలంక వద్ద బందీలుగా ఉన్న భారత జాలర్ల ఆంశం చర్చకు వచ్చింది. జాలర్లను విడుదల చేయాలని ప్రధాని మోదీ కోరగా.. శ్రీలంక అందుకు అంగీకరించింది. తమ చెరలో ఉన్న జాలర్లను విడుదల చేయడమే కాకుండా వారి పడవలను కూడా తిరిగి ఇవ్వనున్నట్టు ప్రకటించిందని మోదీ తెలిపారు.