29-03-2025 01:34:55 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మార్చి 28 (విజయ క్రాంతి): మహిళలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన శుక్రవారం సభ సత్ఫలితాలను ఇస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభ నిర్వహణపై మహిళలకు అవగాహన వచ్చిందని, తద్వారా చిన్నారులు లోప పోషణ, మహిళల్లో రక్తహీనత తగ్గుముఖం పడుతోందని అన్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కొక్కెరకుంట గ్రామంలో 71 మంది చిన్నారులు ఉండగా కేవలం ఆరుగురు పిల్లలకు మాత్రమే లోప పోషణ ఉందని తెలిపారు. వారిని కూడా సాధారణ స్థితికి తెస్తామని తెలిపారు. శుక్రవారం సభ ద్వారా సాధారణ ప్రసవాల పట్ల మహిళలకు అవగాహన పెరిగిందని అన్నారు.
కొక్కరకుంట అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి గర్భిణీ, బాలింతల నమోదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే సబితా కుమారి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, సిడిపిఓ నర్సింగారాణి పాల్గొన్నారు.