ఆర్టీసీ యజమాన్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికుల ఆందోళన
డిపో నుంచి బయటకు రాని 120 బస్సులు.. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
ఉన్నతాధికారులు, కార్మిక సంఘాల చొరవతో సద్దుమణిగిన ఉద్రిక్తత
జనగామ, ఆగస్టు 7 (విజయక్రాంతి): అకారణంగా ప్రయాణికులను బస్సు నుంచి దించివేశాడనే ఆరోపణలపై జనగామ డిపో పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్ శంకర్‌పై ఆర్టీసీ యాజమాన్యం విచారణ జరిపించిన అనంతరం బుధవారం వేటు వేసింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై బుధవారం తెల్లవారుజామున ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నాకు దిగారు. కండక్టర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిపో నుంచి 120 బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
కండక్టర్‌పై అకారణంగా యాజమాన్యం చర్యలు తీసుకుందని ఆందోళన వ్యక్త ం చేశారు. బస్సులో గర్భిణి నిలబడి ఉండడంతోనే మరోప్రయాణికురాలిని కండెక్టర్ సీటు ఇవ్వాలని కోరాడన్నారు. అందుకు ఆమె నిరాకరించి, బస్సు దిగి వెళ్లిపోయిందన్నారు. అనంతరం సదరు ప్రయాణికురాలు ‘ఎక్స్’ ద్వారా ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారన్నారు. సమాచారం అందుకున్న వరంగల్ ఆర్‌ఎం జనగామ డిపోకు వచ్చి కార్మికులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ, సీపీఎం, కాంగ్రెస్ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఏసీపీ పార్థసారథి ఆందోళనకారులతో మాట్లాడి కార్మికులను శాంతింపజేశారు. వారం రోజుల్లో కండక్టర్ శంకర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అధికారులు చెప్పడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు బస్సు సర్వీసులు బయటకు వచ్చాయి. బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.