26-03-2025 01:19:05 AM
బీజేపీ నాయకులు ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం, మార్చి 25 (విజయ క్రాంతి): దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మార్పిడి చేసి వక్రీకరించిన సోర్స్ సన్సాడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ పైన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు గోదల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అత్యున్నత చట్టసభ అయినా పార్లమెంట్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ, ఎస్సీ, ఎస్టీల విషయంలో చేసిన ప్రసంగాన్ని సోర్స్ సన్సాడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రధానమంత్రి ప్రసంగాన్ని మొత్తం వక్రీకరించి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ చేస్తూ దేశ ప్రతిష్ట తో పాటు ప్రధానమంత్రి ప్రతిష్టను దిగజారుస్తున్నదని దీనిని అనుసరిస్తూ కొంతమంది వ్యక్తులు మీడియాలో అధికంగా వైరల్ చేస్తున్నారని తెలిపారు.
కావున వెంటనే వారిపై తగు చర్యలు తీసుకొని ప్రధానమంత్రి ప్రసంగాన్ని వక్రీకరించి దేశ ప్రధానమంత్రి ప్రతిష్టను దిగజార్చినందున సదరు యూట్యూబ్ ఛానల్ పై, దాని నిర్వాహకుల పైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. అలాగే వైరల్ చేస్తున్న మిగతా మీడియా వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల మాజీ అధ్యక్షులు దండే శ్రీశైలం, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు దొండ రమణారెడ్డి, గంగనమోని సత్యనారాయణ బిజెపి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.