calender_icon.png 14 October, 2024 | 9:50 AM

ఫ్రెషర్లను జాయిన్ చేసుకోవడం లేదు

21-08-2024 12:30:00 AM

ఇన్ఫోసిస్‌పై కార్మిక శాఖకు ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: క్యాంపస్‌ల్లో రిక్రూట్ చేసుకుని రెండేండ్లు గడిచినా ఉద్యోగాల్లోకి తీసుకోకుండా జాప్యం చేస్తున్నదంటూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై నాస్కంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్) కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖకు ఫిర్యాదు చేసింది. ఐటీ, బీపీవో, కేపీఓ వృత్తినిపుణుల సంక్షేమం కోసం పనిచేసే నైట్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇన్ఫోసిస్ లిమిటెడ్ 2,000 మంది యువ ఇంజినీర్లను సిస్టమ్ ఇంజినీర్ (ఎస్‌ఈ), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (డీఎస్‌ఈ) రోల్స్‌లోకి 2022 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో తీసుకున్నదని, 2022 ఏప్రిల్‌లోనే వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చినా, ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదని ఆరోపించింది. ఈ మేరకు తాము కార్మిక శాఖకు ఫిర్యాదు చేశామని నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. ఇన్ఫోసిస్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని, యువ వృత్తినిపుణులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.