calender_icon.png 28 September, 2024 | 3:01 PM

ఫెడ్ బూస్ట్‌తో సరికొత్త రికార్డు

20-09-2024 12:00:00 AM

ఇంట్రాడేలో 825 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

25,600 పాయింట్ల స్థాయిని దాటిన నిఫ్టీ

ముంబై, సెప్టెంబర్ 19: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్ అంచనాల్ని మించి వడ్డీ రేట్లను అరశాతం తగ్గించడంతో భారత్ స్టాక్ సూచీలు గురువారం సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 825 పాయింట్లు పెరిగి 83,773 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ముగింపులో జరిగిన లాభాల స్వీకరణతో చివరకు 237 పాయింట్ల పెరుగుదలతో 83,185 పాయింట్ల వద్ద నిలి చింది. ఈ స్థాయిలో సెన్సెక్స్ ముగియడం ఇదే ప్రధమం.

ఇదేబాటలో నిఫ్టీ ఇంట్రాడేలో 230 పాయింట్లకుపైగా ఎగిసి చర్రి తలో తొలిసారిగా 25, 600 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 25,611 పాయిం ట్ల వద్ద కొత్త రికార్డు స్థాయిని తాకిన తర్వాత చివరకు 38 పాయింట్ల లాభంతో 25,415  పాయింట్ల వద్ద నిలిచింది. అంచనాల్ని మించి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో మార్కెట్ రికార్డుస్థాయిల్ని నెలకొ ల్పిన అనంతరం స్వల్ప లాభాలతో ముగిసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారీ కోతతో ఆర్థిక మందగమనంపై ఆందోళనలు తలెత్తడంతో ప్రీమియం విలువలతో ట్రేడవుతున్న మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగిందని వివరించారు. 

ఎన్టీపీసీ టాప్ గెయినర్

 సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 2.5 శాతం పెరిగింది. నెస్లే, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారు తి, హిందుస్థాన్ యూనీలీవర్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్‌లు క్షీణించాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.64 శాతం పెరిగింది.

రియల్టీ ఇండెక్స్ 0.47 శాతం, బ్యాంకెక్స్ 46 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.34 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.32 శాతం చొప్పున పెరిగాయి. టెలికాం కంపెనీలపై సుప్రీం కోర్టు తీర్పు ప్రభావంతో టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ భారీగా 3.89 శాతం తగ్గింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.81 శాతం,  ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.56 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.22 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.60 శాతం, ఐటీ ఇండెక్స్ 0.48 శాతం చొప్పున పడిపోయాయి.   బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 1.06  శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం చొప్పున నష్టపోయాయి.

ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై అనుమానాలు

ట్రేడింగ్ తొలిదశలో మార్కెట్లో కన్పించిన ఉత్సాహం మధ్యాహ్న సెషన్‌లో ఆవిరైపోయిందని, దీంతో మా ర్కెట్ చాలావరకూ ఫ్లాట్‌గా ట్రేడయ్యిందని మార్కెట్స్ మోజో గ్రూప్ సీఈవో అమిత్ గోలియా చెప్పారు. ఫెడ్ రేట్ల కోతను ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదని, ఇతర ట్రిగ్గర్స్ కోసం వేచిచూస్తున్నదని వివరించారు. క్రూడాయిల్ ధరలు 52 వారాల కనిష్ఠం వద్ద కదలడం, ఐరెన్‌ఓర్, స్టీల్ తదితర లోహాలు ఏండ్ల కనిష్టానికి పడిపోవడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నదనడానికి సంకేతమని అమిత్ చెప్పారు. వడ్డీ రేట్ల కోత ప్రభావం రానున్న రోజుల్లో కార్పొరేట్ లాభాల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? అంతర్జాతీయ డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు చేకూరుస్తుందన్న అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని వివరించారు. 

ఫెడ్ రేట్ల కోత ప్రభావం భారత్‌పై అంతంతే!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత్ నాగేశ్వరన్ చెప్పారు. గురువారం జరిగిన డెలాయిట్ సదస్సులో మాట్లాడుతూ ఇప్పటికే రేట్ల కోతను భారత్ స్టాక్ మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదన్నారు.  యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) ఫెడరల్ ఫండ్స్ రేటును అరశాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఇండియాలోకి వచ్చే విదేశీ పెట్టుబడులపై రేట్ల తగ్గింపు ప్రభావం ఉండబోదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. భవిష్యత్తులో అమెరికా వడ్డీ రేట్లు ఏ మేరకు తగ్గుతాయి? ఇతర ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లు ఎలా ఉంటాయన్నదని చూడాల్సి ఉందని చెప్పారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయం

రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపును ఎప్పుడు ప్రారంభిస్తుందన్న ప్రశ్నకు అజయ్ సేథ్ స్పందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదన్న అంశం ఆధారంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.