calender_icon.png 22 September, 2024 | 7:14 AM

స్విస్ ఖాతాల ఫ్రీజ్ అబద్ధం

14-09-2024 03:13:21 AM

అదానీ గ్రూప్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: అదానీ గ్రూప్‌తో సంబంధమున్న స్విస్ ఖాతాల్లోని 310 మిలియన్ డాలర్లను అక్కడి ప్రభుత్వం జప్తు చేసినట్లు షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార వార్తలని స్పష్టం చేసింది. కుట్రపూరితంగా హిండెన్‌బర్గ్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండి పడింది.

అదానీ గ్రూప్‌తో సంబంధముందని చెబుతున్న కంపెనీలపై చేపట్టిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆరు స్విస్ ఖాతాల్లోని 310 మిలియన్ డాలర్లకుపైగా నిధులను జప్తు చేసినట్లు స్విస్ వార్తా సంస్థ గోథమ్ సిటీ కథనం పేర్కొందని హిండెన్‌బర్గ్ చెబుతూ ఆ లింక్‌ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడా వంటి పన్ను తక్కువగా ఉండే దేశాల్లోని ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో పలు ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈ సంస్థలు 2021లో అదానీ షేర్లలో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఆ కథనం పేర్కొన్నదని హిండెన్‌బర్గ్ రాసుకొచ్చింది.

దీనిపై స్పందించిన అదానీ గ్రూప్.. ఏ స్విస్ కోర్టు విచారణనూ తాము ఎదుర్కోవడం లేదని తెలిపింది. తమ కంపెనీ ఖాతాలపై ఏ అధికారులు న్యాయపరమైన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంది. ఆ కథనంలో పేర్కొన్న ఉత్తర్వుల్లో కూడా తమ గ్రూప్ కంపెనీల గురించి స్విస్ కోర్టు ప్రస్తావించలేదని స్పష్టం చేసింది.