దళారులపై కేసులు నమోదుకు పోలీసుల వెనకడుగు...
నాగర్ కర్నూలు (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని కృష్ణ పరివాహక ప్రాంతాల్లో నిషేధిత అలివివలలు విసిరే ముఠా వద్ద వెట్టి చాకిరీ చేస్తున్న ముగ్గురు కార్మికులకు మంగళవారం పెంట్లవెల్లి మండల పోలీసులు, కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ గుంటూరు మంగళగిరి ప్రాంతానికి చెందిన సుభాని, శ్రీమాన్నారాయణ, సలీం అనే వ్యక్తులు హైదరాబాద్లో పని చేసుకుంటుండగా హైదరాబాద్ ప్రాంతంలో గుంపు మేస్త్రిగా ఉన్న గురుమూర్తి అనే వ్యక్తి కొంతమంది కార్మికులను కృష్ణ పరివాహ ప్రాంతాల్లోని పెంట్లవెల్లి, సింగోటం తదితర గ్రామ పరిసరాల్లోనీ కృష్ణా నదిలో అక్రమంగా అలవివలలు విసిరి సొమ్ము చేసుకోవడం కోసం కొంతమంది కార్మికులను బలవంతంగా నదిలోకి దింపుతున్నారు. వేలా పాలా లేకుండా రాత్రి సమయంలో బలవంతంగా నదిలోకి దింపి వెట్టి చేయించుకోవడంతో కార్మికులు దగ్గర్లోని కొంతమంది వ్యక్తుల సాయంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో కార్మిక శాఖ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో ముగ్గురు కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దినసరి కూలీలుగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న దళారులపై కేసులు నమోదు చేయకపోవడంతో పలువురు అధికారుల తీరుపై స్థానికులు విమర్శిస్తున్నారు.